సినీ గ్లామర్‌ను దట్టిస్తున్న పార్టీలు.. బెంగాల్లో రసవత్తరంగా పాలిటిక్స్‌.. బీజేపీ గాలానికి చిక్కిన మిథున్‌

పశ్చిమ బెగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అయితే ఓటర్లను ఆకర్షించుకోవడానికి..

  • K Sammaiah
  • Publish Date - 9:24 am, Mon, 8 March 21
సినీ గ్లామర్‌ను దట్టిస్తున్న పార్టీలు.. బెంగాల్లో రసవత్తరంగా పాలిటిక్స్‌.. బీజేపీ గాలానికి చిక్కిన మిథున్‌

పశ్చిమ బెగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అయితే ఓటర్లను ఆకర్షించుకోవడానికి సినీ గ్లామర్‌ను దట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు పార్టీల కండువాలు కప్పగా.. తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బాలీవుడ్, బెంగాల్ సినీ రంగాల్లో మెగాస్టార్ గా వెలుగొందుతోన్న ప్రముఖ నటుడు, టీఎంసీ కీలక నేత, డిస్కో కింగ్ మిథున్ చక్రవర్తి భారతీయ జనతా పార్టీలో చేరారు. కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్గీయా, పార్టీ బెంగాల్‌ శాఖ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు మిథున్‌ చక్రవర్తి చెప్పారు. తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు బీజేపీ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. బెంగాలీని అని చెప్పుకోవడం తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు తాను నటించిన బెంగాలీ సినిమాలోని ఒక డైలాగ్‌ చెప్పి అలరించారు. అమీ జోల్దోరవో నోయి, బెలె బొరావో నోయి.. అమీ ఏక్తా కోబ్రా, ఏక్‌ చోబోల్‌–యి చోబి(నన్ను విషంలేని పాము అనుకోవద్దు. నేను అసలు సిసలైన కోబ్రాను. నేను కాటు వేస్తే.. మీరు (ప్రత్యుర్థులు) గోడకు వేలాడదీసే ఫొటో ఫ్రేమ్‌లో ఉండాల్సిందే) అని మిథున్‌ ప్రత్యర్థులను హెచ్చరించారు. తాను గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశానని మిథున్‌ అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని తెలిపారు. బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందన్నారు మిథున్‌ చక్రవరి. బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. ఈరోజు బంగ్లార్‌ చెలే(బెంగాలీ బిడ్డ) మిథున్‌ చక్రవర్తి మనతో ఉన్నారని చెప్పారు. ఆయన జీవితం, సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అయితే మిథున్‌ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన 2014లో టీఎంసీ తరపున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో 2016లో రాజీనామా చేశారు. శారదా కుంభకోణంలో మిథున్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన అవకాశవాది అని టీఎంసీ, కమ్యూనిస్టు పార్టీలు విమర్శించాయి.

వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న తొలి సభ వేదికపైనే మిథున్ దాదా బీజేపీలో చేరారు. బీజేపీ బెంగాల్ వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ స్వయంగా కండువా కప్పి, పార్టీలోకి ఆయన్ను ఆహ్వానిస్తారని భావించినా, మోదీ రాకముందే మిథున్ పార్టీలో చేరిపోవడం గమనార్హం. 2014లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన మిథున్ చక్రవర్తి.. శారద చిట్ ఫండ్ కుంభకోణం తర్వాత పదవికి రాజీనామా చేశారు. నాలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన శారద సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ అయిన మిథున్.. తర్వాతి కాలంలో ఆ సంస్థకు ప్రకటనలు చేసినందుకు లభించిన రూ.1కోటిపైగా మొత్తాన్ని ఈడీకి చెల్లించేశారు. గతంలో నక్సలైట్లతోనూ తనకు సంబంధాలున్నాయని ప్రకటించిన మిథున్.. ఇవాళ రైట్ వింగ్ పార్టీలో చేరడం గమనార్హం.

ఇక మోదీ సభకు ఇసుకేస్తే రాలనంతగా జనం హాజరయ్యారు. ఇదే మైదానంలో వారం రోజుల కిందట కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలు నిర్వహించిన తొలి సభకు కూడా ఇదే రీతిలో జనం హాజరయ్యారు. కాగా, 70 ఏళ్ల మిథున్ చక్రవర్తిని బెంగాల్ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది..