AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Reservation Bill: ఎట్టకేలకు మహిళా బిల్లుకు మోక్షం.. ఎంపీల డిమాండ్‌కు మోదీ ఓకే.. వర్షాకాలంలో గుడ్‌న్యూస్

వచ్చే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లుకు మోక్షం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Women Reservation Bill: ఎట్టకేలకు మహిళా బిల్లుకు మోక్షం.. ఎంపీల డిమాండ్‌కు మోదీ ఓకే.. వర్షాకాలంలో గుడ్‌న్యూస్
Rajesh Sharma
|

Updated on: Mar 08, 2021 | 6:38 PM

Share

Women Reservation Bill to pass soon: కొన్ని సందర్భాలలో, కొన్ని ప్రత్యేక దినోత్సవాలలో మాత్రమే వినిపించి.. ఆమోదించే సమయం వచ్చేసరికి ఏదో రకంగా అడ్డుపుల్ల వేసే చట్టాలు, బిల్లుల కోవలో ప్రధానంగా కనిపించే మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ బిల్లు తరచూ చర్చల్లో మాత్రమే నానుతోంది. పార్లమెంటు ఉభయ సభలకు వచ్చే సరికి ఏవేవో కొర్రీల పేరిట ఆమోదం వాయిదా పడుతుంది. దశాబ్దాలుగా జరుగుతున్న తంతు ఇది. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. గమ్మత్తేంటంటే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే పార్లమెంటు బడ్జెట్ మలి విడత సమావేశాలు మొదలయ్యాయి.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపేనా? ఇదిపుడు చర్చనీయాంశం. సోమవారం (మార్చి 8) నుంచి ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు బడ్జెట్ సమావేశాల రెండో సెషన్ ప్రారంభం అయ్యింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొలి రోజు రాజ్యసభలో మహిళా ఎంపీలకు పలు అంశాలపై మాట్లాడడానికి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అనుమతిచ్చారు. లోక్‌ సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని మహిళా ఎంపీలు డిమాండ్‌ చేశారు. శాసనసభలలో, పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్లు పొందే సమయం ఆసన్నమైందన్న ఎంపీ ఛాయా వర్మ అభిప్రాయపడ్డారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై 24 సంవత్సరాల తరువాత చర్చ జరుగుతుందని పరోక్షంగా దెప్పి పొడిచారు మరో మహిళా ఎంపీ ప్రియాంక చతుర్వేది. 2010లో రాజ్యసభ ఈ బిల్లు ఆమోదించిన తరువాత ఇప్పటి వరకు చట్టంగా మారకపోవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృషి వల్లే మహిళలకు పంచాయితీల్లో మెరుగైన ప్రాతినిధ్యం లభించిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు అమీ యాగ్నిక్ చెప్పుకొచ్చారు. వీలైనంత త్వరగా మహిళా రాజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వర్షాకాల సమావేశాల్లో బిల్లు?

ఇదిలా వుండగా.. వచ్చే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లుకు మోక్షం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. నిజానికి దేశ రాజకీయాలలో మహిళలకు అవకాశాలు కల్పించాలన్న ప్రతిపాదన 1974లో లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర విద్య, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ కమిటీని నియమించింది. అప్పటికి దేశం రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్య శాతం చాలా తక్కువగా ఉంది. ప్రాథమికంగా మహిళలకు రాజకీయాలలో ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వం తలపెట్టింది. ముందుగా పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలలో మహిళలకు స్థానం పెంచాలని ప్రతిపాదించారు. వారికి ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ. 1993లో నియోజకవర్గ చట్ట సవరణ జరిగింది. అధికరణ 73, 74 అనుసరించి చట్టాన్ని సవరించారు. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలలో పాల్గొనేందుకు మహిళలకు మూడోవంతు రిజర్వేషన్‌ అమలు చేసేందుకు ఈ చట్ట సవరణ దారి తీసింది.

1996 సెప్టెంబరు 12న 81వ నియోజకవర్గ సవరణ బిల్లుననుసరించి మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది హెచ్‌.డి.దేవెగౌడ ప్రభుత్వం. యునైటెడ్ ఫ్రంట్ మైనారిటీలోకి పడిపోవడంతో మహిళా బిల్లు మూలన పడింది. 1996 డిసెంబరు 9న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై నివేదిక సమర్పించారు. జెపీసీ ఛైర్మెన్‌, సిపిఐ ఎంపి గీతా ముఖర్జీ నివేదికను సమర్పించారు. 1998లో రెండోసారి ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది అటల్‌ బిహారీ వాజపేయి సర్కార్‌. పూర్తి గడువు తీరకుండానే లోక్‌సభ రద్దు కావటంతో మహిళా బిల్లు మరోసారి మరుగున పడింది. 1999లో మరోసారి లోక్‌సభ ముందుకు వచ్చింది మహిళా రిజర్వేషన్‌ బిల్లు. 1999 డిసెంబర్‌ 23న దిగువ సభలో బిల్లును ప్రవేశ పెట్టింది ఎన్‌డిఏ ప్రభుత్వం. రాజకీయ ఏకాభిప్రాయం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గగ్గోలు పెట్టడంతో మరోసారి మహిళా బిల్లుకు తిరస్కారమే ఎదురైంది.

2008 మేలో జరిగిన సెషన్‌లో అప్పటి మన్మోహన్ ప్రభుత్వం మరోసారి మహిళా రిజర్వేషన్‌ బిల్లును తెరమీదికి తీసుకువచ్చింది. 14వ లోక్‌సభ గడువు ముగిసినా లేక రద్దయినా బిల్లు యాక్టివ్‌గా వుండేలా కొన్ని మార్పులు చేశారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణ 108వ బిల్లు -2008ను ప్రతిపాదించారు. 2010 మార్చి 9న మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. దీంతో చట్ట సభలలో పాల్గొనేందుకు దేశీయ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కలుగే అవకాశం వుంది. గత పదకొండేళ్ళుగా అంటే 2010 మే నెల నుంచి లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్నదీ మహిళా రిజర్వేషన్ బిల్లు. రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుపై పైకి ఒకటి మాట్లాడుతూ.. లోపల మాత్రం వేరేలా ప్రవర్తిస్తూ.. బిల్లుకు మోకాలడ్డుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. కనీసం ఈ వర్షాకాల సమావేశాల్లో అయినా మహిళా బిల్లు లోక్‌సభ ఆమోదం పొందుతుందా అన్నది వేచి చూడాలి.

ALSO READ: చట్టాలెన్ని వున్నా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే ఉపయోగం

ALSO READ: మొబిలిటీ నుంచి వెహికిల్ ఉత్పత్తికి.. ఓలా క్యాబ్స్‌ భారీ ప్రణాళిక

ALSO READ: బీజేపీ ఆకర్ష్‌కు భారీ స్పందన.. తృణమూల్ గూడు వీడుతూ దీదీకి పంచ్‌లిస్తున్న నాయకులు

ALSO READ: పుజారా ఎంపిక వెనుక చెన్నై పెద్ద వ్యూహం.. ధోనీ నిర్ణయానికి మేనేజ్‌మెంటు అందుకే సై అంది!