Telangana: పైనుంచి చూస్తే అల్లం లోడే… లోపల చెక్ చేసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది
గంజాయి వ్యాపారం సాగిస్తున్న ముఠాలు పెట్రేగిపోతున్నాయి. రోజుకో కొత్త మార్గంలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ.. అధికారులకే షాక్ ఇస్తున్నారు కేటుగాళ్లు.
Cannabis: స్పెషల్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేస్తున్నా… డ్రగ్స్(Drugs), గంజాయి(Cannabis) స్మగ్లర్లు బరితెగిస్తూనే ఉన్నారు. రోజుకో కొత్త మార్గంలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ.. అధికారులకే షాక్ ఇస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా విశాఖ, ఒడిశా ప్రాంతాల నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.21వేల నగదు, 800 కిలోల గంజాయిని సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన వికాస్ జాదవ్ కొంత కాలంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడు. విశాఖ-ఒడిశా బోర్డర్ లోని కోరాపుట్ ఏజెన్సీలో గంజాయి పండిస్తున్న సుభాష్ కుమార్ అలియాస్ రాహుల్ కుమార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పంట చేతికి రాగానే అతడు వికాస్ జాదవ్‌కు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాంతో జాదవ్ తనకు సాయం చేసే… లారీ డ్రైవర్లు నాసిక్‌కు చెందిన అశోక్ కులే, అమోల్ అథవాలేలకు సరుకు తీసుకురావాల్సిందిగా ఆర్డర్ వేస్తాడు. సమాచారం అందుకున్న అశోక్ మహారాష్ట్రకు చెందిన విశాల్ జగన్నాథ్ పరచోరేకు విషయం చెప్పి లారీని రెడీ చేయమంటాడు. సమాచారం అందగానే.. జగన్నాథ్ తన అనుచురులైన ఫిరోజ్ మోమిన్, సుడామ్ గోటేకర్‌లను రంగంలోని దింపుతాడు. ఇలా వారంతా పక్కా స్కెచ్ వేసి.. కొన్నేళ్లుగా లారీల్లో గంజాయిని కోరాపుట్ నుంచి నాసిక్‌కు రవాణా చేసి వికాస్ జాదవ్‌కు చేరవేస్తున్నారు. పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ముందుగా కారులో పైలటింగ్ చేసుకుంటూ సరుకును తరలిస్తారు.
ఈ నెల 19న కూడా ఇదే స్కెచ్ ఫాలో అయ్యారు. అశోక్, అథవాలే, రాహుల్ కుమార్‌తో పాటు మరో నలుగురు కారు, డీసీఎంలతో కోరాపుట్‌కు వెళ్లారు. గంజాయి సప్లై చేసే సుభాష్ ఆదేశాల మేరకు 800 కేజీల గంజాయిని 5 కేజీల చొప్పున ప్యాకింగ్ చేశారు. మొత్తం 156 ప్యాకెట్లను డీసీఎం వ్యాన్‌లో ఉంచారు. అయితే ఇక్కడే వారు అతి తెలివిగా వ్యవహరించారు. పోలీసులను మాయ చేయడానికి.. గంజాయిపై అల్లం బస్తాలు వేశారు. కారులో పైలటింగ్ చేస్తుకుంటూ ఏపీ, తెలంగాణ దాటేందుకు ట్రై చేశారు.
అయితే తెలంగాణ పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. స్పెషల్ డ్రైవ్స్ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్మగ్లిగ్ బ్యాచ్ ఓఆర్‌ఆర్ టోల్‌గేట్ల వద్ద టోల్ రుసుముతో పాటు చెకింగ్ పాయింట్స్‌లో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వ్యూహరచన చేశారు. నగరంలో నుంచి గూడ్స్ లారీ మాదిరిగా వెళ్లడానికి ట్రై చేశారు. సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, మియాపూర్ ఇన్‌స్పెక్టర్ తిరుపతిరావు జాయింట్ ఆపరేషన్ చేశారు. డీసీఎం వ్యాన్ మియాపూర్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు, వ్యాన్‌లో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. డీసీఎం, గంజాయి సహా పట్టుకున్న సొత్తు విలువ రూ.1.80 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.