Mid Day Meal: ఇంటర్ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఇకపై కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు
కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వ పాఠశాలలకు మత్రమే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకం ఇకపై జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేయనుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకనట జారీ చేశారు..
అమరావతి, డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్నం భోజన పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధులకు గతంలోనూ ఈ పథకం అమలులో ఉండేది. 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేశారు. అయితే 2019లో అధికారం మారడంతో ఈ పథకం రద్దయింది. 2024 ఎన్నికల్లో మెజార్టీ ఓట్లతో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ ఇప్పుడు మళ్లీ ఈ పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. పైగా ఈ పథకం అమలు కాలంలో జూనియర్ కాలేజీల్లో విద్యార్ధుల హాజరు శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లనే ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్ధులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ‘పదోతరగతి పూర్తిచేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా డ్రాపౌట్స్ శాతం కొంత తగ్గించే అవకాశం ఉంది. సంకల్ప్ ద్వారా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి కాలేజీలకు వెళ్లేలా ప్రోత్సహించాలి. ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్లు, సిబ్బందిని కేర్‌టేకర్లుగా నియమించాలి. అలాగే కాలేజీల్లో దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులు చేపట్టాలి. డిసెంబర్ 7న తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాన్ని పండుగగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్దమవుతోంది. దీంతో పాఠశాల విద్యార్థుల మాదిరిగా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
విద్యార్ధులు ఉదయాన్నే కళాశాలకు వచ్చి మధ్యాహ్నం భోజన విరామం తర్వాత విద్యార్ధులు ఇళ్లకు వెళ్లిపోవడం, తరగతులను గైర్హాజరవడం తరచూ జరుగుతుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులకి ఆర్థికంగా సహాయం మాత్రమే కాకుండా, విద్యలో ప్రగతికి కూడా దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని, విద్యార్థుల నైతిక విలువలను బోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని లోకేష్ తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే పాఠ్యాంశాల కోసం ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని, జపనీస్ విధానంలో విద్యార్ధుల్లో జీవన నైపుణ్యాలు అలవరిచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పాఠశాల ఆవరణల్లో ఉద్యోగ మేళాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకూ అనుమతి ఇవ్వకూడదని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ నుంచి పీజీ వరకు కరికులం ప్రక్షాళనపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.