Sankranti Holidays 2025: స్కూల్ విద్యార్థులకు షాక్.. భారీగా తగ్గనున్న సంక్రాంతి సెలవులు? ఎందుకంటే
తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండక్కి రెండు రాష్ట్రాల్లో స్కూళ్లకు రెండు వారాల వరకు సెలవులు ఇస్తారు. అయితే ఈ సారి మాత్రం సంక్రాంతి సెలవులను భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తుంది..
అమరావతి, డిసెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో సంక్రాంతి సెలవులను భారీగా కుదించనుంది. పదో తరగతి పరీక్షల తేదీలు దాదాపు ఖరారు అయినట్లే. విద్యాశాఖ రూపొందించిన టైం టేబుల్ ప్రభుత్వ పరిశీలనకు కూడా పంపించారు. రేపే మాపో అధికారిక టైం టేబుల్ వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. టెన్త్ పబ్లిక్ పరీక్షల సన్నద్ధత కోసం ఆదివారాలతోపాటు ఇతర సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని యాక్షన్ ప్లాన్‌లో విద్యాశాఖ పాఠశాలలకు సూచించింది. ఈ క్రమంలో సంక్రాంతి సెలవుల్లో కూడా ప్రత్యేక క్లాసులు నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతుంది. దీంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులకు కుదించే అవకాశం ఉంది. గతంలో సంక్రాంతి పండక్కి దాదాపు రెండు వారాలపాటు సెలవులు ఇచ్చేవారు. ఈసారి మాత్రం సెలవును మూడు రోజులకు కుదించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రేపు 3, 6, 9 తరగతుల విద్యార్ధులకు రాష్ట్రీయ సర్వేక్షణ్ పరీక్ష
దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఎన్‌సీఈఆర్టీలోని స్వతంత్ర సంస్థ పరాఖ్ డిసెంబరు 4న సర్వే నిర్వహించనుంది. రాష్ట్రీయ సర్వేక్షణ్-2024 పేరుతో రాష్ట్రంలో ఎంపికచేసిన 2,729 పాఠశాలల్లో 81 వేల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 3, 6, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్షలు జరుగుతాయి. భాష, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు విమర్శనాత్మక ఆలోచన, సమస్యలను పరిష్కరించే నేర్పు, విశ్లేషణ నైపుణ్యాలపైనా ప్రశ్నలు అడుగుతారు. ఆఫ్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు ఓఎంఆర్ షీట్‌లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్ర విద్యార్థులు ఈ పరీక్షలో వెనుకబడ్డారు. దీంతో ఈసారి విద్యార్థులను ముందుగానే సన్నద్ధం చేసి, నమూనా ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
నేడు క్యాట్ 2024 కీ విడుదల
కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) 2024 కీ ఈ రోజు (డిసెంబర్ 3) విడుదలకానుంది. డిసెంబర్ 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం ఫైనల్ కీ రూపొందించి ఫలితాలు వెల్లడిస్తారు. క్యాట్‌లో సాధించిన పర్సంటైల్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం 170 నగరాల్లో నవంబర్ 24న ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు లేదా జనవరి నెల మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది.