TGPSC Chairman: టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ.. 11 నెలల్లో 12,403 ఉద్యోగాల భర్తీ..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీవిరమణ పొందారు. ఆయన సారధ్యంలో టీజీపీఎస్సీ పూర్తిగా కడిగిన ముత్యంలా మారిందంటే అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలకు, అక్రమాలకు అడ్డాగా మారిన టీజీపీఎస్సీని తనదైన వ్యూహంతో చక్కదిద్ది పెండింగ్ లో ఉన్న అన్ని నియామకాలను వివాదాలకు తావివ్వకుండా పూర్తి చేయడం మాటలుకాదు.. అది మహేందర్ రెడ్డి చేసి చూపించారు..

TGPSC Chairman: టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ.. 11 నెలల్లో 12,403 ఉద్యోగాల భర్తీ..
Mahender Reddy Retirement
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 04, 2024 | 6:58 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ మహేందర్ రెడ్డి డిసెంబర్‌ 3వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగారు. కేవలం 11 నెలలు మాత్రమే టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా విశ్రాంత డీజీపీ మహేందర్‌రెడ్డి ఆ పదవిలో కొనసాగారు. అయితే తక్కువ కాలం ఛైర్మన్‌గా ఉన్నప్పటికీ ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, తుది ఫలితాల వెల్లడిలో కీలక పాత్ర పోషించారు. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన టీజీపీఎస్సీని.. ఉద్యోగ పోటీ పరీక్షల సమర్థ నిర్వహణ, ఫలితాల వెల్లడి, పారదర్శకత, బయోమెట్రిక్‌ హాజరు, ఆటోమేషన్‌ ద్వారా తుది నియామకాల వెల్లడికి సంబంధించి సమర్ధవంతంగా పలు సంస్కరణలు తీసుకువచ్చి గాడిన పెట్టారు మహేందర్‌రెడ్డి.

మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో 2024 జనవరి నుంచి నవంబరు వరకు దాదాపు 21 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటి ద్వారా మొత్తం 12,403 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఈ మేరకు గత 11 నెలల కాలంలో టీజీపీఎస్సీ సాధించిన ప్రగతి, సంస్కరణలపై కమిషన్‌ సోమవారం నివేదికను విడుదల చేసింది. అంతేకాకుండా ఏళ్లకుఏళ్లు వివాదాల్లో చిక్కుకుని అట్టడుగున పడిపోయిన పలు పోస్టులను కూడా నైపుణ్యంతో పరిష్కరించి ఆ నియామకాలను కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా ఏడేళ్లకు పైగా న్యాయవివాదాల్లో చిక్కుకున్న ల్యాబ్‌టెక్నీషియన్, ఫిజియోథెరపిస్టు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల సమస్యలను చక్కగా పరిష్కరించి ఎంపికైన వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇక వరుస పేపర్‌ లీకేజీలతో ప్రకంపనలు సృష్టించి రెండు సార్లు రద్దయిన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలను ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు ఎదురుకాకుండా సమర్ధవంతంగా నిర్వహించారు. గ్రూప్‌ 1 తుది ఫలితాలు 2025 ఫిబ్రవరిలోగా వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నట్లు కమిషన్‌ పేర్కొంది. ఇలా చెప్పుకుంటూ పోతే చైర్మన్‌గా.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను సంస్కకరించిన ధీశాలిగా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి సమర్ధతను మెచ్చుకుని తీరాల్సింది.

టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి పదవీకాలం డిసెంబరు 2తో పూర్తయింది. ఈ సందర్భంగా సోమవారం కమిషన్‌ కార్యాలయంలో కమిషన్‌ సభ్యులు, ఉద్యోగుల సమక్షంలో ఆయనకు వీడ్కోలు సమావేశం జరిగింది. ఇక మరో రెండు రోజుల్లో కొత్త ఛైర్మన్‌గా ఐఏఎస్‌ అధికారి బుర్రావెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.