Layoffs: గాల్లో దీపంలా సాఫ్ట్‌వేర్ కొలువులు.. 3500 మందిని ఇంటికి పంపనున్న టెక్ దిగ్గజం
ఆర్థిక మాంద్యం తప్పదన్న వార్తల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి వార్తలు రావడం ఆగిపోయాయి అనుకుంటున్న సమయంలోనే మరో టెక్ దిగ్గజం భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు బాంబు పేల్చింది...

ఆర్థిక మాంద్యం తప్పదన్న వార్తల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి వార్తలు రావడం ఆగిపోయాయి అనుకుంటున్న సమయంలోనే మరో టెక్ దిగ్గజం భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు బాంబు పేల్చింది. ప్రముఖ సంస్థ కాగ్నెజెంట్ ఏకంగా 3500 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తు్న్నట్లు ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ ఎస్.రవి కుమార్ వెల్లడించారు. అలాగే, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 11 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాలను కూడా వదులుకోనున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రదేశాల్లో తమ కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది. 2023లో ఆదాయాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్న నేపథ్యంలో కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్న మనీ కంట్రోల్ వెబ్‌సైట్ నివేదించింది. ఇక కంపెనీ మార్జిన్లు అత్యల్పంగా 14.6 శాతం ఉన్నాయని తెలిపింది. మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని కంపెనీ లాభాల పట్టేందుకుగాను ఉద్యోగులను తొలగించడం, కార్యాలయ స్థలాలను తగ్గించడం వంటివి ఉన్నాయని మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది.
ఇదిలా ఉంటే ఈ ఉద్యోగుల తొలగింపు భారత్‌లో పనిచేసే ఉద్యోగులపై ఎంతమేర ప్రభావం చూపుతుందన్న దానిపై స్పష్టత లేదు. ఇక కాగ్నెజెంట్ పేరుకు అమెరికా కంపెనీ అయినప్పటికీ దాని కార్యకలాపాలు ఎక్కువగా భారత్ కేంద్రంగానే సాగుతున్నాయి. దీంతో ఈ ఉద్యోగుల తొలగింపు ఇండియన్ టెకీలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం కాగ్నిజెంట్‌లో 3,51,500 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో 2 లక్షల వరకు భారత్‌లోనే పని చేస్తున్నారు.




మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..