APPSC Job Notifications 2025: నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఎపీపీఎస్సీ నుంచి మరో 3 నోటిఫికేషన్లు వచ్చాయ్!
ఎపీపీఎస్సీ తాజాగా మరో 3 వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆగస్టు 19వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు వచ్చేనెల..

అమరావతి, ఆగస్టు 12 : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ తాజాగా మరో 3 వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆగస్టు 19వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 8, 2025వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖలోనూ 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు బుధవారం (ఆగస్ట్ 13) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఇక భూగర్భజల శాఖలో 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి కూడా ఎపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు కూడా ఆగస్టు 13 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి. సెప్టెంబర్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఎపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో జాబ్ నోటిఫికేషన్లను పొందుపరిచామని, పూర్తి వివరాలు అక్కడ తెలుసుకోవచ్చని ఎపీపీఎస్సీ కార్యదర్శి పి రాజాబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అభ్యర్ధులందరికీ ఓటీఆర్ తప్పనిసరి. అంటే ముందుగా ఓటీపీఆర్‌కు రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
ఆగస్టు18 నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ధ్రువపత్రాల పరిశీలన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్/బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ప్రత్యేక కేటగిరీ ఎన్‌సీసీ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆగస్టు 18వ తేదీ నుంచి 4 రోజుల పాటు నిర్వహించనున్నట్లు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధికారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నీట్ యూజీ ఒకటో ర్యాంకు నుంచి 1,38,000 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 19న 1,38,001 నుంచి 2,60,000 వరకు, ఆగస్టు 20న 2,60,001 నుంచి 4,91,000 వరకు, ఆగస్టు 21న 4,91,001 నుంచి ఆఖరి ర్యాంకు వరకు విద్యార్ధులు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




