TRAI Scam: ట్రాయ్ పేరుతో మోసగాళ్ల సరికొత్త అవతారం.. జాగ్రత్తపడకుంటే మీ సొమ్ము హాంఫట్

ఇటీవల కాలంలో పెరుగుతున్న టెక్నాలజీను వాడుకుని మోసగించే వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే క్రమేపి డిజిటల్ మోసాలపై ప్రజలు అవగాహనతో ఉండడంతో స్కామర్లు కొత్తదారులను వెతుక్కుంటున్నారు. తాజాగా ట్రాయ్ పేరుతో మోసగించి డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాయ్ స్కామ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

TRAI Scam: ట్రాయ్ పేరుతో మోసగాళ్ల సరికొత్త అవతారం.. జాగ్రత్తపడకుంటే మీ సొమ్ము హాంఫట్
Trai Scam
Follow us
Srinu

|

Updated on: Jan 16, 2025 | 6:32 PM

ట్రాయ్ స్కామ్ అంటే కోవిడ్-19 సమయంలో లేదా డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల గురించి ఇటీవల అవగాహన కల్పిస్తూ వస్తున్న వాయిస్ మాదిరిగా ఉండేలా ఫోన్లు చేస్తున్నారు. ఈ తరహా ఫోన్లు ఇటీవల చాలా మందికి వస్తున్నాయి  గత కొన్ని నెలలుగా ఇటువంటి స్కామ్ కాల్స్ బాధితులు తమ సొమ్మును కోల్పోతున్నారు. ఆగస్టులో హైదరాబాద్‌లోని ఒక వ్యక్తి ట్రాయ్ అధికారిగా నటిస్తూ ఒకరి నుంచి కాల్ అందుకున్న తర్వాత సుమారు రూ. 11 లక్షలు పోగొట్టుకున్నాడు. మరో కేసులో 25 ఏళ్ల ఐఐటీ-బాంబే గ్రాడ్యుయేట్ ఇలాంటి కుంభకోణంలో రూ.7 లక్షలు పోగొట్టుకున్నాడు. అయితే కాల్ స్వీకరించి అందులోని సూచనలు పాటించడంతో బాధితులుగా మారుతున్నారు. కాల్ వచ్చాక ముందుగా మీ నంబర్‌పై అనధికార లావాదేవీలు జరిగాయని అందువల్ల మీ నంబర్ బ్లాక్ చేస్తున్నామని చెబుతారు. అనంతరం మరిన్ని వివరాల కోసం 9ని నొక్కమని, అలాగే నంబర్ డియాక్టివేట్ కాకుండా ఉండాలనుకుంటే సూచనలను అనుసరించాలని సూచించడంతో చాలా మంది అలాగే చేస్తున్నారు. 

కాల్ రిసీవ్ చేసుకుని 9 నొక్కిన తర్వాత, మరొక అధికారికి ఫోన్ కనెక్ట్ అవుతుంది. స్కామర్లు వెంటనే భయపెట్టి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని భయపెడతారు. ముఖ్యంగా స్కామర్‌లు కాల్ మాట్లాడుతున్న వ్యక్తులకు వీడియో కాల్‌లలో ఉండాలని, ఈ విషయాన్ని కుటుంబం లేదా స్నేహితులతో చెప్పవద్దని పేర్కొంటారు. ముఖ్యంగా మేమే మీకు సహాయం చేస్తున్నామంటూనే బాధితులు ఐడి ప్రూఫ్‌లు, బ్యాంక్ వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని  తెలుసుకుంటారు. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనీలాండరింగ్‌లో పాల్గొన్నారనే నెపంతో డబ్బును బదిలీ చేయమని వేధిస్తారు. బాధితులను బెదిరించేందుకు స్కామర్లలో నకిలీ పోలీసులు, న్యాయమూర్తులు, సుప్రీం కోర్ట్ ఇన్స్పెక్టర్లుగా నటిస్తూ బ్యాక్ గ్రౌండ్ కూడా అలానే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. దీంతో తాము నిజంగా అరెస్ట్ అయ్యామనే భయంతో  బాధితులు డబ్బు పంపడం లేదా బ్యాంక్ వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని చెబుతారు. అన్ని అభియోగాల నుండి వారి పేరును క్లియర్ చేయడం కోసం మోసగాళ్ళు బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటామని ఓటీపీ చెప్పాలని వేధిస్తూ సొమ్మును తస్కరిస్తున్నారు.

జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

ముఖ్యంగా బాధితులు డిజిటల్ అరెస్ట్ గురించి పూర్తి అవగాహనతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ట్రాయ్ లేదా పోలీసు అధికారులు సంస్థలు ఫోన్ ద్వారా వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని అడగవని గుర్తుంచుకోవాలి.  డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని పోలీసులు చెబుతున్నారు. అలాగే మీకు అలాంటి కాల్స్ వస్తే ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలి. ప్రత్యేకించి వారు సున్నితమైన సమాచారం లేదా అత్యవసర ఆర్థిక లావాదేవీల కోసం అడుగుతుంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని తెలియని కాలర్‌లతో ఎప్పుడూ షేర్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి