ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్‌గా భారత్.. తొమ్మిదేళ్ల ప్రస్థానంలో కీలక మైలురాయి
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, స్టార్టప్ ఇండియా, రాష్ట్ర-స్థాయి విధానాలు, అలాగే పెరుగుతున్న ప్రతిభ, డిజిటల్ కనెక్టివిటీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో మౌలిక సదుపాయాలు బలమైన మద్దతు పలుకుతున్నాయి. భారతీయ స్టార్టప్‌లు దేశీయ సవాళ్లను పరిష్కరించడమే కాకుండా ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తున్నాయి.
సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం భారత ప్రభుత్వం ప్రారంభించిన “స్టార్టప్ ఇండియా” దేశాన్ని 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ (Startup Eco System)గా తీర్చిదిద్దింది. వ్యాపార, పారిశ్రామిక రంగాలతో పాటు వివిధ రంగాల్లో సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకొచ్చే యువతను ప్రోత్సహించడం కోసం ఏర్పడిన స్టార్టప్ ఇండియా 2025 జనవరి 16 నాటికి తొమ్మిదేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని 10వ ఏటలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా జనవరి 16ను కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టార్టప్ డే (National Startup Day)గా పేర్కొంటూ.. తొమ్మిదేళ్ల ప్రయాణంలో అధిగమించిన మైలురాళ్లు, సాధించిన విజయాలను వెల్లడించింది.
భారత ప్రభుత్వం “స్టార్టప్ ఇండియా” పేరుతో సరికొత్త ఆలోచనలతో వచ్చే యువతకు ఆర్థిక వనరులు కల్పించడం, వివిధ శాఖల నుంచి అనుమతులు కల్పించడంలో సహకరిస్తూ ప్రోత్సహిస్తూ వచ్చింది. దీనికి తోడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో ఇంజనీరింగ్, సైన్స్ రంగాల్లో చదువుకున్న యువత కూడా పెద్ద సంఖ్యలో ఉండడం కలిసొచ్చింది. సాంకేతిక పరిజ్ఞానం కల్గిన మానవ వనరులే భారతదేశానికి ఒక ఆస్తిలా మారాయి. వీటన్నింటికీ మించి ప్రపంచంలోని ఏ ఇతర దేశంతో పోల్చినా సరే ఇక్కడ తక్కువ ఖర్చుతో కంపెనీలను ఏర్పాటు చేయడం, తక్కువ ఖర్చుతోనే మానవ వనరులను పొందగల్గడం భారత్‌లోనే సాధ్యపడుతోంది. ఇవన్నీ ప్రస్తుతం భారత్‌ను స్టార్టప్ ఎకోసిస్టమ్‌లలో 2-3 స్థానాల్లో నిలబెడుతోంది. మొదటి స్థానంలో అమెరికా కొనసాగుతుండగా.. 2-3 స్థానాల్లో భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ అటూ ఇటుగా కొనసాగుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కెనడా, జెర్మనీ ఉన్నాయి.
డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) గణాంకాల ప్రకారం 9 సంవత్సరాల క్రితం భారతదేశంలో కేవలం 500 స్టార్టప్ కంపెనీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 1.59 లక్షల స్టార్టప్ కంపెనీలు, వాటిలో 100కు పైగా యూనికార్న్ కంపెనీలతో ప్రపంచస్థాయిలో భారతదేశం దూసుకుపోతోంది. ఈ తొమ్మిదేళ్లలో 16 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించిన రంగంగా రికార్డుల్లో నిలిచింది. జొమాటో, ఓలా, జీరోదా, జెప్టో, బ్లింకిట్, కంట్రీ డిలైట్ వంటి నిత్యజీవితంలో ఉపయోగించే అనేక రకాల ఈ-కామర్స్, ఫిన్‌టెక్ యాప్స్ అన్నీ స్టార్టప్‌లే అన్న విషయం మరువరాదు. ఇవన్నీ స్థానిక మార్కెట్లో అనేక సవాళ్లను పరిష్కరించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొదాయి. దేశ ముఖచిత్రాన్ని మార్చేసి, ఆర్థిక పురోగతిలో భాగమయ్యాయి.
స్టార్టప్ ఇండియాలో కొన్ని విశేషాలు
– భారత్‌లో స్టార్టప్‌ల సంఖ్య 1,59,157
– 2024 అక్టోబర్ నాటికి మొత్తం 73,151 గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉన్నారు.
– ఈ 9 సంవత్సరాలలో, గుర్తింపు పొందిన స్టార్టప్‌లు 16.67 లక్షల ఉద్యోగాలను సృష్టించాయి
ఏయే రంగాల్లో సృష్టించిన ఉపాధి ఎంత?
– ఐటీ సేవలు – 2.04 లక్షలు
– హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ – 1.47 లక్షలు
– వృత్తిపరమైన, వాణిజ్య సేవలు – 94, 060
– విద్య – 90, 414
స్టార్టప్ ఇండియా చొరవ ప్రత్యేకత ఏమిటి?
– వ్యాపారాన్ని సులభంగా చేయడం: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో వ్యాపారాలను ప్రారంభించడం సులభతరం చేయడం
– పన్ను ప్రయోజనాలు: స్టార్టప్ ప్రారంభించే వారికి వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
– నిధుల మద్దతు: స్టార్టప్‌ల కోసం రూ. 10,000 కోట్ల విలువైన నిధుల నిధి అందుబాటులో ఉంది.
– వివిధ రంగాలకు ప్రత్యేక విధానాలు: బయోటెక్నాలజీ, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలకు సంబంధించిన కేంద్రీకృత విధానాలు.
‘డెవలప్డ్ ఇండియా యంగ్ లీడర్స్ డైలాగ్’లో భారతదేశ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను మరింత విస్తరించాలని ప్రధానమంత్రి మోదీ కోరుకున్నారు. నేటి భారతదేశం కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. నేడు భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, అదే సమయంలో నేడు ప్రపంచంలోనే నంబర్ వన్ ఫిన్‌టెక్ ఎకో సిస్టమ్ భారతదేశంలో ఉందని తెలిపారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా భారత్ నిలవడం గర్వంగా ఉందని తెలిపారు. అలాగే భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా కొనసాగుతోదని వెల్లడించారు. భవిష్యత్తులో భారతదేశం ప్రపంచ అభివృద్ధికి కేంద్రంగా మారుతుందని, ఇది ప్రపంచ వృద్ధి ఇంజిన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..