బంక్ నుంచి ఒక రోజులో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొనొచ్చు? తాజా నిబంధనలు ఇవే
ఒక వ్యక్తి ఒక రోజులో సరిగ్గా ఎంత పెట్రోల్ లేదా డీజిల్ కొనగలడు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ఈ విషయంపై అధికారిక చట్టపరమైన నియమాలు ఏమి చెబుతున్నాయో ఈరోజు తెలుసుకుందాం.. దేశంలో నెలకొన్న ఇంధన కొరత కారణంగా చాలా మంది అత్యవసర పరిస్థితుల కోసం తమ కార్ల ట్యాంకులను నింపుకుంటూ ఉంటే.. మరికొందరు క్యాన్లు నింపేస్తున్నారు..

ఇరాన్- అమెరికా యుద్ధ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. కొన్నిచోట్ల ఇంధన కొరతపై వదంతులు వ్యాపిస్తుండటంతో జనాల్లో ఆందోళన నెలకొంది. దీంతో నగరాల్లోని దాదాపు అన్ని పెట్రోల్ పంపుల వద్ద జనాలు పొడవైన క్యూలలో కనిపిస్తున్నారు. చాలా మంది అత్యవసర పరిస్థితుల కోసం తమ కార్ల ట్యాంకులను నింపుకుంటూ ఉంటే.. మరికొందరు క్యాన్లు, డ్రమ్ములతో నేరుగా పంపుల వద్దకు వెళ్తున్నారు. ఈ గందరగోళంలో ఒక వ్యక్తి ఒక రోజులో ఎంత వరకు పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేయవచ్చు? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
మీరు బైక్ లేదా కారు వంటి మీ సొంత వాహనంలో పెట్రోల్ పంపుకు వెళుతున్నట్లయితే ఒక రోజులో ఎన్నిసార్లు, ఎన్ని లీటర్ల ఇంధనం కొనుగోలు చేయవచ్చనే దానిపై ఎటువంటి చట్టపరమైన పరిమితి లేదు. మీరు మీ వాహనం ట్యాంక్‌ను పూర్తిగా నింపుకోవచ్చు. అయితే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఇంధన కొరత తీవ్రంగా ఉన్నప్పుడు శాంతిభద్రతలను కాపాడటానికి స్థానిక జిల్లా యంత్రాంగం కొన్ని తాత్కాలిక నియమాలను విధించవచ్చు. దీని ప్రకారం ప్రతి వాహనానికి ఒక నిర్దిష్ట పరిమాణంలో ఇంధనంపై పరిమితిని విధిస్తారు. అయితే ఇది శాశ్వత పరిమితి కాదు. కేవలం తాత్కాలికం మాత్రమే. ఈ నిబంధనలు సాధారణ పరిస్థితులలో వర్తించవు. విడిగా పెట్రోలు కొనుగోలు చేయడానికి సంబంధించి ‘పెట్రోలియం నియమాలు 2002’ ఉన్నాయి. వీటి ప్రకారం.. ఏ సాధారణ వినియోగదారుడూ సాధారణ రిటైల్ పెట్రోల్ పంపు నుంచి ఒకేసారి లేదా ఒక రోజులో 200 లీటర్ల కంటే ఎక్కువ పెట్రోల్ నేరుగా కొనుగోలు చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో 1 నుండి 5 లీటర్ల అదనపు పెట్రోల్ కొనుగోలు చయవచ్చు. దానిని ప్లాస్టిక్ సీసాలో సరఫరా చేయకూడదు. దీని కోసం పంపు వద్ద ఆమోదించబడిన స్టీల్ లేదా మందపాటి లోహపు కంటైనర్లను మాత్రమే ఉపయోగించాలి.
అలాగే మీకు జనరేటర్లు, వ్యవసాయ పనులు లేదా ఇతర ప్రయోజనాల కోసం డ్రమ్ములలో 20 నుండి 200 లీటర్ల ఇంధనం అవసరమైతే మీకు అది ఎందుకు అవసరమో కారణాన్ని తెలుపుతూ పంపు వద్ద రాతపూర్వకంగా తెలియజేయాలి. మరోవైపు, ఎవరైనా ఒకేసారి 200 లీటర్ల కంటే ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (PESO) నుంచి అధికారిక నిల్వ లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈ లైసెన్స్ లేకుండా పెట్రోల్ బంక్ వద్ద పెద్ద పరిమాణంలో ఇంధనాన్ని పంపిణీ చేస్తే వారి లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దేశంలో ప్రస్తుతం తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి. అందువల్ల ఎలాంటి వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా అధికారిక లైసెన్సు లేకుండా ఇంట్లో లేదా గిడ్డంగిలో మండే స్వభావం గల పెట్రోల్, డీజిల్‌ను పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుకోవడం చట్టపరమైన నేరంగా పరిగణించబడుతుంది. అది ప్రాణాలకు తీవ్రమైన ముప్పు కలిగించే అవకాశాం ఉంది. కాబట్టి నిబంధనలను పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
