AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిణి కార్తె అంటే ఏమి.. రోళ్లు పగిలే ఎండలు.. ఎందుకు వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

రోహిణి కార్తెకు సమయం ఆసన్నమైంది. దీంతో హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రానున్న 15 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరగనుంది. భానుడి ప్రతాపంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఎవరూ బయటకు రాకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

రోహిణి కార్తె అంటే ఏమి.. రోళ్లు పగిలే ఎండలు.. ఎందుకు వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Why Is It Hot In Rohini Karte
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: May 22, 2026 | 1:34 PM

Share

రోహిణి కార్తెకు సమయం ఆసన్నమైంది. ఇక రాబోయే 15 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి మారినప్పుడు వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని రోహిణి కార్తెగా పరిగణిస్తారు. సోమవారం మే 25వ తేదీన సూర్య భగవానుడు ఈ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా జూన్ 8వ తేదీ వరకు ఎండలు కనీవినీ ఎరుగని రీతిలో మండిపోతాయి. ఈ పదిహేను రోజులు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతాయి.

సాధారణంగా వేసవి కాలంలో ఉండే ఎండల కంటే ఈ పక్షం రోజులు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఉంటాయి. సూర్య కిరణాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా భూమి మీద పడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఎండల తీవ్రతను చెప్పడానికే మన పెద్దలు రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయని ఒక సామెతను వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.

హిందూ పంచాంగం ప్రకారం ఏడాదికి మొత్తం ఇరవై ఏడు కార్తెలు ఉంటాయి. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే దానికి ఆ నక్షత్రం పేరు పెడతారు. రోహిణి కార్తె పూర్తయిన వెంటనే జూన్ 9వ తేదీ నుంచి మృగశిర కార్తె మొదలవుతుంది. ఈ సమయంలోనే వాతావరణం చల్లబడి తొలకరి జల్లులు నేలను తాకుతాయి. వ్యవసాయ పనులు చేసుకునే రైతులకు ఇది అత్యంత కీలకమైన సమయం. ఈ తొలకరి జల్లుల ఆధారంగానే అన్నదాతలు తమ పొలాల్లో ఏరువాక పనులు ముమ్మరంగా మొదలుపెడతారు.

ఈ పక్షం రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పెద్దలు సూచించిన కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు లేదా కొత్త పనులు చేపట్టకపోవడం ఎంతో మంచిది. అలాగే వేడి చేసే పదార్థాలకు ముఖ్యంగా మాంసాహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా సాత్విక ఆహారం తీసుకుంటూ చల్లటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగాలి.

మిట్ట మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకపోవడమే శ్రేయస్కరం. ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు సుదూర ప్రాంతాలకు చేసే ప్రయాణాలు ఉంటే వాటిని వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలి. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ సమయంలో మన స్తోమతకు తగ్గట్లుగా దానధర్మాలు చేయడం ఎంతో పుణ్యమని భక్తులు గట్టిగా విశ్వసిస్తారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి.

Follow Us