Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Financial Crisis: ఆర్థిక మాంద్యం అంచున పాకిస్తాన్‌.. భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం.. ఐఎంఎఫ్‌ రుణంపైనే ఆశ..

ప్రపంచవ్యాప్తంగా కమ్ముకొంటున్న మాంద్యం ఛాయలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక మూలాలు బలహీనంగా ఉన్న దేశాల్లో మునుపెన్నడూ చూడని సంక్షోభాలు వచ్చే అవకాశం ఉంది...

Pakistan Financial Crisis: ఆర్థిక మాంద్యం అంచున పాకిస్తాన్‌.. భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం.. ఐఎంఎఫ్‌ రుణంపైనే ఆశ..
Inflation
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 20, 2022 | 8:17 AM

ప్రపంచవ్యాప్తంగా కమ్ముకొంటున్న మాంద్యం ఛాయలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక మూలాలు బలహీనంగా ఉన్న దేశాల్లో మునుపెన్నడూ చూడని సంక్షోభాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీలంక అలాంటి సుడిగుండంలో చిక్కుకోగా, ఆ తరవాతి వంతు పాకిస్థాన్‌ అని తెలుస్తుంది. పాక్‌ విదేశ మారకద్రవ్య నిల్వలు భారీగా క్షీణించడంతోపాటు ఈ పరిస్థితుల్లో కొత్త అప్పు పుట్టకుంటే కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. కరోనా అనంతరం ప్రపంచవ్యాప్తంగా వినియోగ వస్తువుల ధరలు జోరెత్తి, దిగుమతులకు గిరాకీ పెరిగిపోయింది. ఫలితంగా కరెంటు ఖాతా లోటుతో పాక్‌ రూపాయి భారీగా పతనమైంది. ప్రస్తుతం పాక్‌ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) రుణంపైనే ఆధారపడి ఉంది. ఐఎంఎఫ్‌ నుంచి భారీ ప్యాకేజీ కోసం చాలాకాలంగా పాక్‌ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఐఎంఎఫ్‌ నిర్దేశించిన షరతులను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఇటీవల ఇంధనం, విద్యుత్తు ఛార్జీలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. బడ్జెట్‌లో ఇంధన రాయితీల తగ్గింపు, ప్రభుత్వ వ్యయంలో కోతలు వంటి పొదుపు చర్యలు ప్రకటించినా, రుణం విషయంలో ఐఎంఎఫ్‌ నుంచి సుముఖత కనిపించడం లేదని తెలుస్తుంది.

చైనా నుంచి పాక్‌ భారీగా తీసుకున్న రుణాలకు అధిక వడ్డీ రేట్లున్నాయి. తాము రుణం ఇవ్వాలంటే ముందు చైనాతో చర్చలు జరిపి వడ్డీరేట్లు తగ్గించుకోవాలని ఐఎంఎఫ్‌ పాక్‌కు తేల్చి చెప్పింది. ఆ విషయంలో పాక్‌ ప్రభుత్వానిధి దాదాపుగా నిస్సహాయ స్థితే. పాక్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చైనాపై ఆధారపడి సాగుతోంది. వచ్చే కొన్ని నెలల్లోనే చైనాకు అప్పు తీర్చాల్సి ఉంది. చెల్లింపు సమయాన్ని పొడిగిస్తుందన్న నమ్మకంతో పాక్‌ ఉన్నా, బీజింగ్‌ నుంచి ఆ సంకేతాలు లేవని తెలుస్తోంది. చైనా బ్యాంకుల నుంచి అదనపు రుణం తీసుకొనేందుకు యత్నిస్తున్నా, ఎలాంటి షరతులు, నిబంధనలపై ఇస్తారనేది డ్రాగన్‌ వెల్లడించలేదు. పాక్‌లో ద్రవ్యోల్బణం పెచ్చరిల్లింది. ఇంధనం, విద్యుత్తు ధరల ప్రభావంతో నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది. పాక్‌ సంక్షోభం అంచుకు చేరిన ప్రతిసారీ చివరి క్షణంలో గట్టెక్కుతోంది. త్వరలో మళ్లీ అలాంటి పరిణామమే చోటుచేసుకున్నా ఆశ్చర్యం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.