Loan EMI: లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. తగ్గనున్న ఈఎంఐలు.. ఎలానో చూడండి
ఆర్‌బీఐ రెపో రేటను తగ్గించడంతో బ్యాంకులన్నీ త్వరలో లోన్ల వడ్డీ రేటును తగ్గించనున్నాయి. దీని వల్ల ఈఎంఐలు కట్టేవారికి బిగ్ రిలీఫ్ దక్కనుంది. మీరు చెల్లించాల్సిన ఈఎంఐ తగ్గనుంది. దీని వల్ల డబ్బులు ఆదా కానున్నాయి. ఈఎంఐ ఎలా తగ్గుతుంది? అనేవి చూద్దాం

RBI: శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకముందు 5.50 శాతంగా ఉండగా.. ఇప్పుడు 5.25కి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. జీడీపీ వృద్ది సాధించడం, ద్రవ్యోల్బణం తగ్గుదల వంటి కారణాలతో రెపో రేటులో ఆర్‌బీఐ మార్పులు చేసింది. తాజా తగ్గింపుతో కలిపి ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆర్‌బీఐ నాలుగుసార్లు రెపో రేట్లను తగ్గించింది. ఈ తగ్గింపుతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి లేదా కొత్తగా తీసుకోబోయేవారికి వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఇప్పటికే లోన్ తీసుకుని ఉండి ఉంటే మీరు చెల్లించాల్సిన ఈఎంఐ తగ్గుతుంది. ఇక కొత్తగా లోన్ తీసుకోవాలంటే వడ్డీ రేట్లు తగ్గుతాయి.
ఆర్‌బీఐ ప్రకటన వచ్చాక బ్యాంకులు వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేస్తాయి. అప్పటినుంచి కొత్తవి అమల్లోకి వస్తాయి. ఏ బ్యాంకు అయినా తప్పనిసరిగా ఆర్‌బీఐ రూల్స్‌ను పాటించాల్సిందే. దీంతో వడ్డీ రేట్లలో మార్పులు చేయడం తప్పనిసరి. త్వరలో బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది. దీని వల్ల లోన్లు తీసుకున్న సామాన్యులకు భారం తగ్గుతుంది. ఆర్‌బీఐ నిర్ణయం వల్ల లోన్లు తీసుకున్నవారికి ఎలాంటి లాభం జరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం.
ఈఎంఐ ఎలా తగ్గుతుంది?
ఉదాహరణకు మీరు రూ.25 లక్షల హోమ్ లోన్ 8.5 శాతం వడ్డీతో తీసుకుందామనుకందాం. దీనికి మీకు రూ.24,254 ఈఎంఐ ప్రతీనెలా కట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు తగ్గడం వల్ల బ్యాంకులు వడ్డీ రేటును 8.25 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు చెల్లించాల్సిన ఈఎంఐ కూడా తగ్గుతుంది. దీని వల్ల మీకు డబ్బులు ఆదా అవుతాయి. ఇక రూ.25 లక్షలను 20 ఏళ్ల కాల వ్యవధితో తీసుకంటే మీకు ప్రతీనెలా రూ.21,696 పడుతుంది. ఇప్పుడు అది రూ.21,302కి తగ్గుతుంది. దీని వల్ల మీరు చెల్లించాల్సిన మొత్తం మీద రూ.94,545 ఆదా అవుతాయి. అదే రూ.25 ఏళ్ల కాల వ్యవధితో తీసుకుంటే మీకు రూ.1,25,827 సేవ్ అవుతాయి.
వారికి మాత్రమే..
లోన్ తీసుకునేటప్పుడు ఫిక్స్‌డ్ వడ్డీ రేటా లేదా రెపో రేటును అనుసంధానమై ఉండే ఫ్లోటింగ్ రేట్ అని బ్యాంకులు అడుగాయి. మీరు ఫ్లోటింగ్ రేట్ ఎంచుకుంటే బ్యాంకులు వడ్డీ రేటు తగ్గించినప్పుడు మీకు ఈఎంఐ తగ్గుతుంది. అదే ఫిక్స్ డ్ వడ్డీ రేటు ఎంచుకుంటే మీకు ఇప్పుడు తగ్గదు. 2019 అక్టోబర్ 1 తర్వాత పొందిన లోన్లు దాదాపు రెపో రేటుతో అనుసంధానమై ఉంటాయి. దీని వల్ల మీరు బ్యాంక్‌కి వెళ్లి అడగాల్సిన అవసరం లేదు. బ్యాంకులే ఈఎంఐ తగ్గిస్తాయి. ఒకవేళ మీకు తగ్గకపోతే బ్యాంక్ బ్రాంచ్‌ని సంప్రదించాలి.




