Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: తాయిలాల తీపి కబురు కోసం సామాన్యుడి నిరీక్షణ.. నిర్మలమ్మ మ్యాజిక్ చేసేనా..?

ఫిబ్రవరి 1నే మన కేంద్ర బడ్జెట్. ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు.. ఇంకెన్నో సంకేతాలతో బడ్జెట్ 2025 రాబోతోంది. ఏరంగానికి ఎంత కేటాయిస్తారో ఇప్పటికే నిపుణులు ఓ అంచనాకొస్తున్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం.. ఆమెప్రకటించే తాయిలాల కోసం సగటి భారతీయుడు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు..!

Budget 2025: తాయిలాల తీపి కబురు కోసం సామాన్యుడి నిరీక్షణ.. నిర్మలమ్మ మ్యాజిక్ చేసేనా..?
Budget 2025
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 30, 2025 | 9:45 PM

ఫిబ్రవరి 1 వస్తోంది.. ప్రతి రైతులోనూ ఏదో ఆశ.. ఈసారైనా తన కలఫలించకపోతుందా అని.. ప్రతి మద్యతరగతి జీవిలో ఏదో తెలియని ఉద్వేగం.. ఈసారైనా తన కోరిక తీరే దారి దొరుకుందేమోనని.. ప్రతి ఉద్యోగిలోనూ ఏదో విశ్వాసం.. ఈసారైనా తన కష్టానికి కోత పడకూడదు అని.. ప్రతి పారిశ్రామిక వేత్తలోనూ ఏదో నిరీక్షణ.. ఈదఫా తన లక్ష్యం నెరవేరకుండా ఉంటుందా..అని.. ప్రతి కార్మికుడిలోనూ ఏదో ఆశావాదం.. ఈసారైనా తమ వాగ్దానాలు నిలబెట్టుకోరా అని.. ఇలా ప్రతి రంగం..ప్రతి వర్గం….ఎంతో ఆశగా.. ఉత్కంఠగా…ఉద్వేగంగా ఎదురు చూస్తోంది. దేనికోసం.. ఫిబ్రవరి ఒకటి కోసం.. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం.. బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పే మాటల కోసం.. ఆమె ప్రకటించే తాయిలాల కోసం.. ఆమె అందించే తీపి కబురు కోసం…!

మన పెద్దలు చెప్పినట్టు…ఒక దేశం గొప్పతనం…పరిమాణంతో రాదు. ఆదేశ ప్రజల సంకల్పం, ఐక్యత, సత్తువ, క్రమశిక్షణ, పటిష్టమైన నాయకత్వం ఆ దేశాన్ని చరిత్రలో గౌరవ స్థానంలో నిలుపుతాయి. అంటే – దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం కలగజేయడం, వారి జీవన ప్రమాణాలు పెంచడం. పేదలకు గృహనిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుదల, పేద కుటుంబాలన్నింటికీ కూడు, గూడు, గుడ్డ, ఉపాధి కల్పించడం, వృద్ధాప్య పెన్షన్లు, ఆయుష్మాన్‌ భారత్, పరిశ్రమలకు ఊతం.. వ్యవసాయరంగానికి పెద్దపీట వేయడం.. బీజేపీ మాటల్లో చెప్పాలంటే సబ్‌ కా సాత్…సబ్‌కా వికాస్.. మరి మన కేంద్ర బడ్జెట్‌లో ఆ మాటలు ప్రతిఫలిస్తున్నాయా..?

కేంద్రం ప్రతియేటా ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌ కారణంగా ప్రభావితం అయ్యే వర్గాల్లో సహజంగానే బడ్జెట్‌ ముందు తీవ్ర ఉత్కంఠ ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈసారి ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌లో పెద్ద ఎత్తున సంక్షేమ పథ కాలు ఉండొచ్చునన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పన్ను విధానంలో మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేందుకు పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు అవకాశం ఉందని సమాచారం. అందులో భాగంగా పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకోసం బడ్జెట్‌లో ఆకర్షణీయమైన మార్పులు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఆలోచనతో ఉన్నట్లు ఓ చర్చ అయితే సాగుతోంది.

2020 నాటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ద్వారా పన్ను రేట్లను తగ్గించారు. అందులో చాలా మినహాయింపులు ఇచ్చారు. దీంతో పన్నుల ప్రక్రియను సులభతరం చేశారు. సంప్రదాయ పన్ను ప్రయోజనాలను వదులు కోవడానికి సిద్ధంగా ఉన్న వారికి స్వల్ప పన్ను రేట్లు ఇస్తామని వాగ్దానం చేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా ఆరు శ్లాబ్‌లతో కూడిన పన్ను విధానాన్ని తీసుకు వచ్చారు. అయితే 2021, 2022 బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం అమలు చేయలేదు. కానీ 2023 బడ్జెట్‌లో గణనీయమైన మార్పులను తీసుకు వచ్చారు. ఇక 2024 బడ్జెట్‌లో మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి ముఖ్యంగా జీతం తీసుకునే ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది చేకూర్చారు. దీంతో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000కి పెంచారు. అలాగే ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగులు.. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో పెట్టుబడుల కోసం వారి ప్రాథమిక జీతంలో 14% వరకు తగ్గింపునకు అర్హులుగా నిర్ణయించారు.

అయితే 2025లోఇంకా సరళతరమైన పన్నువిధానాన్ని తీసుకొస్తారన్న అంచనాతో పాటు గంపెడాశతో ఉన్నారు ఉద్యోగులు. మామూలుగా వేతన జీవుల వెతలు తీరాలంటే.. ప్రస్తుత స్లాబ్‌ విధానంలో కొన్ని మార్పులు చేయాలని కోరుతున్నారు. రూ. 10లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి టాక్స్ లేకుండా.. రూ. 10లక్షలకు పైన ఉన్నవారికి మాత్రమే టాక్స్ విధించాలని కోరుతున్నారు. అంటే రూ. 10లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి 10శాతం రూ. 20లక్షలకు పైగా ఉన్నవారికి 20శాతం.. రూ. 30లక్షలకు పైగా ఉన్నవారికి 30శాతం టాక్స్ విధానం ప్రవేశపెడితే అన్ని వర్గాలకు లాభదాయకమని ప్రజల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్.

ఇప్పటివరకు ఐటీ ఫైల్ చేసినవాళ్ల లెక్కలు చూస్తే.. 2014లో 3కోట్ల 65లక్షలమంది ఐటీ ఫైల్ చేయగా.. అది 2024కు రెట్టింపు అయింది. గతేడాది 7కోట్ల 53లక్షలమంది ఐటీ రిటర్న్స్ పైల్ చేశారు. ఐటీ ఫైల్ చేసిన వాళ్లు డబుల్ అయితే.. ప్రభుత్వానికి టాక్స్ రూపంలో వచ్చే ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. 2019-20కాలంలో కార్పొరేట్ పన్ను రూ. 5లక్షల56వేల 876 కోట్లుంటే.. ఆదాయ పన్ను రూ. 4లక్షల95వేల 654కోట్లు మాత్రమే ఉండేది. అయితే కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్ను విధానం.. ఉద్యోగుల్లో కలిగిన అవేర్‌నెస్‌ కారణంగా తర్వాత ఏడాది నుంచి ఇన్‌కం టాక్స్ రెవెన్యూ పెరుగుతూ వచ్చింది. కేవలం ఈ నాలుగేళ్లలోనే ఆదాయం పన్ను మూడింతలు పెరిగింది. 2023-24 పన్ను వసూళ్ల లెక్కలు చూస్తే.. ఇన్‌కం టాక్స్ రూ. 11లక్షల 56వేల కోట్లయింతే.. కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 10లక్షల కోట్లు మాత్రమే.

ఓపక్క ఆదాయంపన్ను వసూళ్లు నాలుగురెట్లు పెరిగితే.. కార్పొరేట్ పన్ను వసూళ్లు నానాటికీ తగ్గుతూ వస్తున్నాయి. 2019 నుంచి 2022వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ కంటే కార్పొరేట్ పన్ను వసూళ్లే అధికంగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. దీనికి మెయిన్ రీజన్ డిజిటల్ ఎకానమీ పెరగడమే. గతంలో కంటే.. ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ జరిగినా ఐటీ నోటీస్ కు వెళ్తోంది. ఏ ట్రాన్సాక్షన్ జరిగినా పాన్ కార్డ్ మేండేటరీ కావడంతో.. డైరెక్ట్‌గా ఐటీకి ఇన్ఫర్మేషన్‌ చేరుతోంది. అంతేకాదు ప్రాపర్టీ సేల్‌లో కూడా పాన్‌కార్డ్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అలాగే రూ. 50లక్షలు దాటిన ఏ కొనుగోలు అయినా 1శాతం టీడీఎస్ తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్‌ ఆఫీసు నుంచి ఐటీ డిపార్ట్‌మెంట్‌కు డిఫాల్ట్‌గా డేటా షేరింగ్ జరుగుతుండడంతో ఎక్కడ ఏ భారీ ట్రాన్సాక్షన్ జరిగినా ఆదాయ పన్ను శాఖ అధికారులకు తెలిసిపోతోంది. అంతేకాదు 2023లో ఐటీ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను అడాప్ట్ చేసుకోవడంతో.. ప్రతి లెక్కా పక్కాగా ఐటీకి తెలిసిపోతోంది. అందుకే భారీగా పన్ను ఆదాయం పెరిగినట్లు నిపుణలు చెబుతున్నారు. ప్రస్తుతం రూ. 10లక్షల వరకు ట్యాక్స్ మినహాయిస్తే ప్రభుత్వంపై రూ. 50వేల నుంచి రూ. లక్షకోట్ల వరకు భారం పెరిగే అవకాశం ఉంది. అయినా కేంద్రం వినియోగదారుల్లో కొనుగోలు శక్తి పెంచేందుకు స్లాబ్‌ సిస్టమ్‌లో చేంజ్ తీసుకురావచ్చన్న చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం భారత్‌-బ్రిటన్‌ను పక్కకు తోసి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇదెలా సాధ్యపడింది? ఇందులో కేంద్ర ప్రభుత్వ చొరవ ఉందంటున్నారు నిపుణులు. గత 20ఏళ్లలో ఇతర దేశాలకంటే భారత్‌ ఐటీ రంగంలో వడివడిగా ముందుకు సాగింది. ఐటీ ఆధారిత సేవలు, ఉత్పత్తుల రంగంలో భారత్‌ అగ్రగామిగా ఉంది. సేవల రంగంలో కూడా మిగతా అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా ఐటీ, సేవల రంగాల్లోనే వస్తున్నాయి. ఇతర కీలక రంగాలలో ఎఫ్‌డీఐలను ఆకర్షించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తిరంగంలో వృద్ధి ఆశాజనకంగా లేదు. ఈ రంగాలపై కేంద్రం ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఉద్యోగాల సృష్టి చేయలేని ఆర్థికాభివృద్ధి వల్ల ఎటువంటి లాభం లేదని గత కొన్నేళ్ల అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఉపాధి, ఉద్యోగాలు లేకుండా ఉన్న యువత సంఖ్య 20కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

2008, 2009 సంవత్సరాలలో భారత్‌ అత్యధిక స్థాయిలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల్ని, 2.5 శాతం జీడీపీ మేర ఆకర్షించింది. కానీ, ఆ మొత్తం క్రమంగా తగ్గిపోతూ 2021 నాటికి 1.4 శాతానికి చేరింది. నిరుద్యోగిత పెరుగుదల వల్ల ప్రజల పొదుపు గణనీయంగా పడిపోయింది. క్యాపిటల్‌ ఫార్మేషన్‌లో కీలకమైన పొదుపు మొత్తాలు సన్నగిల్లడంతో.. కేంద్ర ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు వివిధ మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకొంటోంది. అయితే 2023నుంచి మళ్లీ పెట్టుబడులు గాడిలో పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ లెక్కల ప్రకారం 2024–25 తొలి అర్ధభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా ఎగిశాయి. ఏప్రిల్‌–సెప్టెంబర్‌లో 29.79 బిలియన్‌ డాలర్లు అంటే రూ. 2.4 లక్షల కోట్లు వచ్చాయి. ప్రధానంగా సర్వీసులు, కంప్యూటర్, టెలికం, ఫార్మా రంగాలకు పెట్టుబడులు పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇదే కాలంలో 20.5 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు మాత్రమే లభించాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికం జులై–సెప్టెంబర్‌ లో ఎఫ్‌డీఐలు 43 శాతం వృద్ధితో 13.6 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇది ఓరకంగా నిరుద్యోగితను తగ్గించే అవకాశం ఉంది. అయితే బడ్జెట్‌లో పరిశ్రమలకు ఉంకా ఊతం వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని వ్యాపారవేత్తలు మాట.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..