బడ్జెట్ 2024
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికను వివరించే కేంద్ర బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న దేశ ఆర్థిక మంత్రి పార్లమెంటులో సమర్పిస్తారు. అయితే మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సారి పూర్తి బడ్జెట్‌కు బదులుగా మధ్యంతర బడ్జెట్‌ని సమర్పించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పిస్తారు.
ప్రస్తుత కేంద్ర బడ్జెట్ 2024 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి అయ్యే సాధారణ ఆదాయవ్యయ అంచనాలు, అలాగే ఆర్థిక లోటు, ఆర్థిక పనితీరుతో ఈ మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అందుకే దీన్ని తాత్కాలిక బడ్జెట్‌గానే పరిగణించాలి. అందుకే ఇందులో కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో పెద్ద మార్పులు లేదా కొత్త దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌లు ఉండే అవకాశం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్త ప్రభుత్వాలు పూర్తిస్థాయి బడ్జెట్ జులైలో ఉంటుంది. ఇప్పటి వరకు ఐదుసార్లు బడ్జెట్ సమర్పించిన నిర్మలా సీతారామన్‌కు.. ఫిబ్రవరి 1న సమర్పించే మధ్యంతర బడ్జెట్ ఆరోవది కావడం విశేషం.
ఈ మధ్యంతర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయడం సహజమే. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ కేటాయింపులు పెంచుతూ మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదనలు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆ మేరకు రైతులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, చిరు వ్యాపారులు ఆకట్టుకునేలా నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్ ఉండే అవకాశముంది. అలాగే దేశీయ ఆవిష్కరణలు, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ప్రత్యేక రాయితీలను ప్రకటించే అవకాశముంది. ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచి ఊరట కలిగించాలని వేతన జీవులు కోరుకుంటున్నారు.