Beer: సమ్మర్‌లో బీర్ తాగితే శరీరంలో ఏమవుతుంది.? ‘చిల్’ పడిపోతుంది జాగ్రత్త.!
వేసవిలో బీరు శరీరాన్ని చల్లబరుస్తుందనేది అపోహ మాత్రమే. వాస్తవానికి, ఆల్కహాల్ మూత్రవిసర్జనను పెంచి, డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతుంది, బరువు పెరగడం, కాలేయ సమస్యలు వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు కారణమవుతుంది. బదులుగా, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి సహజ పానీయాలు శరీరానికి మేలు చేస్తాయి.

వేసవి కాలం వచ్చిందంటే చాలు, చాలామంది చల్లటి బీరు తాగి శరీరాన్ని చల్లబరచుకోవాలని అనుకుంటారు. ఈ నమ్మకంతోనే వేసవిలో బీరు అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. అయితే, బీరు నిజంగానే శరీరానికి చలువ చేస్తుందా.. లేదా.. అనేది పెద్ద ప్రశ్న. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బీరు శరీరాన్ని చల్లబరచదు సరికదా, కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది
బీరు వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ ప్రమాదం
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, బీరు శరీరానికి చలువ చేయదు. పైగా, దీనిని ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. బీరులో ఆల్కహాల్ ఉంటుంది, ఇది డైయూరెటిక్‌గా పనిచేస్తుంది. అంటే, ఇది మూత్రవిసర్జనను పెంచుతుంది, దీనివల్ల శరీరంలోని నీరు అధిక మొత్తంలో బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా, శరీరంలో నీటిశాతం తగ్గిపోయి, డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఎండాకాలంలో డీహైడ్రేషన్ చాలా ప్రమాదకరం. ఇది వడదెబ్బకు దారితీసే అవకాశాలను పెంచుతుంది. వడదెబ్బ నుంచి రక్షించే ఎటువంటి లవణాలు బీరులో ఉండవు. బీరు అధికంగా తాగడం వల్ల దీర్ఘకాలికంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
బరువు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు: బీరులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది.
కాలేయ సమస్యలు: దీర్ఘకాలంగా ఆల్కహాల్ సేవించడం వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. డయాబెటిస్ ఉన్నవారికి ఈ రిస్క్ మరింత ఎక్కువ.
జీర్ణ సమస్యలు: బీరులో ఉండే ఆల్కహాల్ పొట్ట లైనింగ్‌ను దెబ్బతీస్తుంది. ఇది విరేచనాలు, అల్సర్లు వంటి జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు.
ఇతర సమస్యలు: కొంతమందికి నిద్ర సరిగా పట్టకపోవడం, అజీర్తి, రక్తపోటు వంటి సమస్యలు కూడా ఎదురు కావచ్చు.
ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు
శరీరానికి చలువ, హైడ్రేషన్ కోసం సహజ పానీయాలు:
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి, హైడ్రేషన్‌ను కాపాడుకోవడానికి సహజసిద్ధమైన పానీయాలు ఉత్తమమైనవి. నిపుణులు సిఫార్సు చేసేవి. ఆ లిస్టు ఇలా ఉంది.
కొబ్బరి నీళ్లు: సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది, శరీరానికి తక్షణ శక్తిని, హైడ్రేషన్‌ను అందిస్తుంది.
మజ్జిగ: ప్రోబయోటిక్స్‌తో కూడిన చలువైన పానీయం.
నిమ్మరసం: నిమ్మకాయ, ఉప్పు కలిపిన నిమ్మరసం డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
సాదా నీరు: క్రమం తప్పకుండా పుష్కలంగా నీరు తాగడం చాలా అవసరం.
నీటిశాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు: పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లు, కూరగాయలు శరీరానికి అవసరమైన నీటిని అందిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే వేసవిలో మద్యపానానికి దూరంగా ఉండటం, సహజమైన, హైడ్రేటింగ్ పానీయాలను ఎంచుకోవడం శ్రేయస్కరం.
ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది
