Shani Dosha 2025: వారికి శని దోషం.. ఈ పరిహారాలతో శనీశ్వరుడు శాంతించే అవకాశం..!
2025 మార్చి 29న శనీశ్వరుడు కుంభ రాశిని వదిలిపెట్టి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. మీన రాశిలో శనీశ్వరుడు రెండున్నరేళ్ల పాటు సంచారం చేస్తాడు. శని మీన రాశి సంచారం వల్ల ఆరు రాశులకు వివిధ రూపాల్లో శని దోషం ప్రారంభం అవుతుంది కొన్ని రాశుల వారు ఇంత వరకూ అనుభవించిన వైభవానికి తెరపడుతుంది. జీవితాలు తారుమారయ్యే అవకాశం ఉంది.

Shani Dosha 2025
Shani Dosha: 2025 మార్చి 29న శనీశ్వరుడు కుంభ రాశిని వదిలిపెట్టి మీన రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. మీన రాశిలో శని రెండున్నరేళ్ల పాటు సంచారం చేస్తాడు. శని మీన రాశి సంచారం వల్ల ఆరు రాశులకు వివిధ రూపాల్లో శని దోషం ప్రారంభం కాబోతోంది. కొన్ని రాశుల వారు ఇంత వరకూ అనుభవించిన వైభవానికి తెరపడుతుంది. జీవితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. శని దోషం వల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు కొన్ని కష్టనష్టాలను అనుభవించే అవకాశం ఉంది. ఈ రాశుల వారు మార్చి 20 నుంచే శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైన పనులు చేయడం వల్ల శని దోషం చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో, అంటే 12వ స్థానంలో శనీశ్వరుడి ప్రవేశం వల్ల వీరికి ఏలిన్నాటి శని ప్రారంభం అవుతోంది. దీనివల్ల ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. వైద్య ఖర్చులు బాగా పెరగడం, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం తగ్గడం వంటివి జరుగుతాయి. విదేశాలకు వెళ్లినవారు కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ రాశివారు తిలాదానం చేయడం, శనీశ్వరుడికి ప్రదక్షిణలు చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.
- సింహం: ఈ రాశికి అష్టమ శని దోషం ప్రారంభం కాబోతున్నందువల్ల ‘అష్టకష్టాలు’ పడే అవకాశం ఉంటుంది. రావలసిన డబ్బు అందకపోవడం, ఆదాయం పెరగకపోవడం, ఆర్థిక సమస్యలు వృద్ధి చెందడం, శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉండడం, వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రాశివారు తరచూ శివార్చన చేయించడం, శనికి తైలాభిషేకం చేయడం, నలుపు లేదా నీలం రంగు కలిసిన దుస్తులు ధరించడం వల్ల శని నుంచి విముక్తి లభిస్తుంది.
- కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పెండింగ్ పనులు పెరిగిపోయే అవకాశం ఉంది. ఏ ప్రయత్నమూ సానుకూలపడదు. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా నిరాశ కలిగిస్తాయి. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ శని బాధల నుంచి విముక్తి పొందాలన్న పక్షంలో తరచూ శివాలయానికి వెళ్లి అర్చన చేయించడం మంచిది. శనికి తిలాదానం చేయించడం వల్ల లాభముంటుంది.
- ధనుస్సు: ఈ రాశికి మార్చి 29 నుంచి అర్దాష్టమ శని ప్రారంభం అవుతోంది. దీనివల్ల కుటుంబ సౌఖ్యం బాగా తగ్గే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు తీవ్రమవుతాయి. సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉండదు. తరచూ అనా రోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. వీటి నుంచి విముక్తి పొందాలన్న పక్షంలో ఎక్కువగా నలుపు, నీలం రంగు కలిసిన దుస్తులు ధరించడం చాలా మంచిది.
- కుంభం: ఈ రాశికి మూడవ దశ ఏలిన్నాటి శని ప్రారంభం కాబోతోంది. దీనివల్ల ఆదాయం తగ్గడం, పనికి తగ్గ ప్రతిఫలం లభించకపోవడం, రావలసిన డబ్బు రాకపోవడం, కష్టార్జితం ఎక్కువగా వృథా కావడం, డబ్బు తీసుకున్నవారు ఇవ్వకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. సహాయం పొందిన వారు ముఖం చాటేసే అవకాశం కూడా ఉంటుంది. వీటి నుంచి బయటపడాలన్న పక్షంలో నవ గ్రహాలకు ప్రదక్షిణలు చేయడంతో పాటు, నల్ల రంగు కలిసిన దుస్తులు ఎక్కువగా ధరించడం మంచిది.
- మీనం: ఈ రాశిలోని శని ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి రెండవ దశ ఏలిన్నాటి శని ప్రారంభం అవుతోంది. దీనివల్ల సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం తగ్గుతాయి. రాజపూజ్యాలు తగ్గి అవమానాలు పెరుగుతాయి. వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక రూపంలో బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అనారోగ్యాలతో అవస్థలు పడాల్సి వస్తుంది. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కు వగా ఉంటాయి. ప్రతి శనివారం శనీశ్వరుడిని ప్రార్థించడం, శివార్చన చేయించడం చాలా మంచిది.



