Career Boost: కుజ, శనుల పరస్పర వీక్షణ.. ఆ రాశుల వారికి అధికార యోగం..!
Career Astrology: ప్రస్తుతం ధనూ రాశిలో కుజుడు, మీన రాశిలో శనిల పరస్పర వీక్షణ జనవరి 16 వరకు కొనసాగుతుంది. దీని ప్రభావంతో కొన్ని రాశులకు అధికార యోగం, ఉన్నత పదవులు, ప్రమోషన్లు, విదేశీ ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. మేషం, మిథునం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశులవారు ఉద్యోగంలో అద్భుత విజయాలు, అంచనాలకు మించిన జీతభత్యాలు పొందుతారు. రాజకీయ, ప్రభుత్వ, రియల్ ఎస్టేట్ రంగాలవారికి ఈ కాలం చాలా అనుకూలం.

Adhikara Yoga
ప్రస్తుతం ధనూ రాశిలో ఉన్న కుజుడు, మీన రాశిలో ఉన్న శని పరస్పరం వీక్షించుకోవడం జరుగుతుంది. ఈ పరస్పర వీక్షణ ఈ నెల (జనవరి) 16 వరకూ కొనసాగుతుంది. ఈ రెండు పాప గ్రహాల పరస్పర వీక్షణ వల్ల కొన్ని రాశులవారికి తప్పకుండా అధికార యోగం పట్టే అవకాశం ఉంది. మేషం, మిథునం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశులవారు తప్పకుండా ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడం, అంచనాలకు మించి జీతభత్యాలు అందుకోవడం జరుగుతుంది. విదేశీ అవకాశాలు బాగా వృద్ధి చెందుతాయి. రాజకీయాలు, ప్రభుత్వం, మిలిటరీ, పోలీస్, రియల్ ఎస్టేట్, విమానయానం, మద్యం రంగాల్లో ఉన్నవారికి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది.
- మేషం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడికి, వ్యయ స్థానంలో ఉన్న శనికి పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఉద్యోగులకు తప్పకుండా అధికార యోగం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారాల్లో ఉన్నవారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న కుజుడు, దశమ స్థానంలో ఉన్న శని పరస్పరం చూసుకోవడం వల్ల ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నైపుణ్యాలు, ప్రతిభ, సమ ర్థత బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. అధికారం చేపట్టడానికి అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.
- తుల: ఈ రాశికి తృతీయ, షష్ట స్థానాల్లో ఉన్న కుజ, శనుల మధ్య సమసప్తక దృష్టి ఏర్పడినందువల్ల ఉద్యోగంలో సీనియర్లను కాదని అధికార యోగం పట్టడానికి అవకాశం ఉంది. ఈ రాశివారు మిలిటరీ, పోలీస్, ప్రభుత్వ రంగాలతో సహా ఏ రంగంలో ఉన్నా తమ సమర్థతను నిరూపించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కొత్త పుంతలు తొక్కు తారు.
- వృశ్చికం: ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడు, పంచమ స్థానంలో ఉన్న శని పరస్పరం వీక్షించుకోవడం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా బాగా రాణించడంతో పాటు, సమర్థతకు బాగా గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారు తప్పకుండా ఉన్నత పదవులు పొందడం జరుగుతుంది. ఉద్యోగాల్లో గరిష్ఠ స్థాయిలో అధికారం చెలాయిస్తారు. మిలిటరీ, పోలీస్, రియల్ ఎస్టేట్ రంగాలవారు పదోన్నతులు పొందుతారు. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- ధనుస్సు: ఈ రాశిలో ఉన్న కుజుడికి, చతుర్థ స్థానంలో ఉన్న శనికి మధ్య పరస్పర దృష్టి ఏర్పడినందువల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు తప్పకుండా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. జీతభత్యాలు కూడా బాగా వృద్ది చెందుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. మిలిటరీ, పోలీస్, లిక్కర్, రియల్ ఎస్టేట్, పైలట్ వంటి రంగాల్లో బాగా రాణించడానికి అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి శని, లాభ స్థానంలో ఉన్న కుజుడు ఒకరినొకరు చూసుకోవడం వల్ల రియల్ ఎస్టేట్, లిక్కర్ వంటి వ్యాపారాల్లో ఈ రాశివారు అపార ధన లాభం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, పోలీస్ శాఖ వారు గుర్తింపు పొందడంతో పాటు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి.