Telangana: భార్యపై కోపం.. ఇద్దరు పిల్లల్ని చంపి కాలువలో పడేసిన తండ్రి! ఆ తర్వాత..
Father Kills Two Children, Attempts Suicide in Narayanpet: నారాయణపేట జిల్లా మరికల్ మండలం తిలేరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కన్న తండ్రి కసాయిగా మారి ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. తర్వాత కోయిల్ సాగర్ డిస్టిబ్యూటరీ కాలువలో పడేసి తాను ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

నారాయణపేట, జనవరి 6: మరికల్ మండలం తిలేరు గ్రామానికి చెందిన శివరాములు, ఉట్కూరు మండలం పెద్దజెట్రం గ్రామానికి చెందిన సుజాతకు సుమారు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు రిత్విక (8), చైతన్య (5) సంతానం. అయితే కొన్నేళ్ల క్రితం ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి కాస్త ఇద్దరు విడిపోయే వరకు వెళ్ళాయి. నాలుగేళ్ల క్రితం భార్య సుజాత పిల్లలను, భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. రెండేళ్ల క్రితం భార్య, భర్తలు విడాకులు సైతం తీసుకున్నారు. ఇద్దరు పిల్లలను తన దగ్గరే ఉంచుకొని శివరాములు జీవనం సాగిస్తున్నాడు.
భార్య వీడిపోయిందన్న బాధలోనే ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం కూతురు అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి శివరాములు చికిత్స చేయించాడు. అయితే సోమవారం రాత్రి సైతం పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని ఇంట్లో చెప్పి పొలం వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడే మద్యం సేవించి… అనంతరం పిల్లల మెడకు ఉరి బిగించి దారుణంగా హత్య చేశాడు. తర్వాత పొలం సమీపంలో ఉన్న కోయిల్ సాగర్ డిస్టిబ్యూటరీ కాలువలో పడేశాడు. అనంతరం తాను సైతం పురుగుల మందు తాగి, గొంతు కోసుకున్నాడు. అలాగే అక్కడే ఉన్న కరెంటు తీగలను పట్టుకోగా తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలతో ఉన్న శివరాములు విషయాన్ని తన స్నేహితుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు.

దీంతో విషయం కుటుంబ సభ్యులకు తెలవడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకొని నీటిలో నుంచి పిల్లను బయటికి తీశారు. అప్పటికే పిల్లలు ఇద్దరు మృతి చెందగా వారిని నారాయణపేటలోని మార్చురీకి తరలించారు. ఇక శివరాములును చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అసలు కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు చనిపోవడంతో కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




