గుడిలో నుంచి శిశువు ఏడుస్తున్న శబ్దాలు.. అక్కడకు వెళ్ళి చూడగా..!
మాతృ ప్రేమ మలీనమవుతోంది. కొందరు ఆడపిల్లలను భూమి మీదికి రాకుండా కడుపులోనే కడతేరుస్తుండగా, మరికొందరు పురిట్లోనే బంగారు తల్లులను వదిలించుకుంటున్నారు. కడుపున పుట్టిన ఆడపిల్లతో పేగుబంధం తెంచుకుంటున్నారు. కష్టమే వచ్చిందో, భారమని భావించిందో..! ఆడపిల్ల అని వదిలించుకుందో తెలియదు కానీ... అప్పుడే పుట్టిన పసికందును దేవాలయంలో వదిలి వెళ్ళింది ఓ తల్లి. అమ్మతనానికే మాయని మచ్చను తెచ్చిన ఈ అమానుష ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమవారంలో లింగ బసవేశ్వర స్వామి ఆలయం ఉంది. నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. తొమ్మిది నెలలు మోసి జన్మనిచ్చిన ఓ తల్లికి ఆడపిల్ల కావడమే శాపమైందో తెలియదు కానీ.. అప్పుడే పుట్టిన ఆ పసికందుకు ఆలయంలో వదిలేసి వెళ్ళింది. ఆ చిన్నారికి ఆలయమే ఆవాసమైంది. తల్లి ఒడిలో వెచ్చగా సేద దీరాల్సిన ఆ చిట్టి తల్లి.. చలికి వణికి పోయింది. గుక్క పట్టి ఏడుస్తోంది. గుడిలో నుంచి శిశువు ఏడుస్తున్న శబ్దాలు.. అటుగా వెళ్తున్న భక్తులు, గ్రామస్తులకు వినిపించాయి. దీంతో ఆలయ పూజారికి భక్తులు సమాచారం ఇచ్చారు.
వెళ్లి చూడగా ఆడ శిశువు కేకలు వేస్తూ కనిపించింది. పూజారి ఫిర్యాదుతో పోలీసులు ఆడ శిశువును భువనగిరి ఆసుపత్రికి తరలించారు. చలికి వణికిపోయిన ఆడ శిశువును ఇంక్యుబేటర్ లో పెట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శిశు ప్రాణాపాయానికి ప్రమాదమేదీ లేదని వైద్యుల చెబుతున్నారు.
తొమ్మిది నెలలు మోసి జన్మనిచ్చిన ఆ తల్లికి.. ముద్దు లొలికే ఆ పాపాయిని వదిలి వెళ్లేందుకు. కడుపు తీపి గుర్తుకు రాలేదా అని స్థానికులు వాపోతున్నారు. పేగు బంధాన్ని వదిలేసిన ఆ తల్లికి కష్టమే వచ్చిందోనని మండి పడుతున్నారు. కర్కశ తల్లి మనసు కరగకపోవడం స్థానికులను కలచి వేసింది. ఆడ శిశువు ఘటనకు సంబంధించి గ్రామంలో సిసి ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
