IPL 2026 : బంగ్లాదేశ్ నిషేధిస్తే ఐపీఎల్ ఆగిపోతుందా? బీసీసీఐకి నిజంగానే కోట్లలో నష్టం వస్తుందా ?
IPL 2026 : భారత్, బంగ్లాదేశ్ మధ్య నడుస్తున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇప్పుడు క్రీడా రంగాన్ని కుదిపేస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించడంతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు ఐపీఎల్ ప్రసారాల నిషేధం వరకు వెళ్లింది.

IPL 2026 : భారత్, బంగ్లాదేశ్ మధ్య నడుస్తున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇప్పుడు క్రీడా రంగాన్ని కుదిపేస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించడంతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు ఐపీఎల్ ప్రసారాల నిషేధం వరకు వెళ్లింది. భారత్‌లో ఐపీఎల్ ఆడబోమని, తమ వరల్డ్ కప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐపీఎల్ ఆదాయానికి గండి పడుతుందా? అన్న అంశంపై ఆర్థిక నిపుణులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ 2026 ప్రసారాలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, దీనివల్ల ఐపీఎల్ బ్రాండ్ విలువకు లేదా బీసీసీఐ ఆదాయానికి పెద్దగా నష్టం ఉండదని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. డి అండ్ పి అడ్వైజరీ మేనేజింగ్ పార్టనర్ సంతోష్ ఎన్ దీనిపై స్పందిస్తూ.. “బంగ్లాదేశ్‌లో ప్రసారాలు ఆగిపోయినంత మాత్రాన బీసీసీఐకి వచ్చే ఆదాయంలో కానీ, బ్రాడ్‌కాస్టర్లు చెల్లించే మొత్తంలో కానీ ఎటువంటి మార్పు ఉండదు” అని స్పష్టం చేశారు. ఐపీఎల్ మార్కెట్ ఎంత పెద్దదంటే, ఒక చిన్న దేశం నిషేధించినంత మాత్రాన దాని క్రేజ్ తగ్గదని ఆయన అభిప్రాయపడ్డారు.
టీఆర్ఏ రీసెర్చ్ సీఈఓ ఎన్.చంద్రమౌళి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ మంచి క్రికెట్ జట్టే అయినప్పటికీ, వ్యాపార పరంగా చూస్తే ఐపీఎల్ ఆదాయాన్ని అది దెబ్బతీయలేదన్నారు. ఒకవేళ బంగ్లాదేశ్ మార్కెట్ వల్ల కొంచెం నష్టం జరిగినా, ఇతర గ్లోబల్ బ్రాండ్లు ఆ ఖాళీని భర్తీ చేస్తాయని ఆయన వెల్లడించారు. పైగా ఉన్న స్పాన్సర్లు తమ ప్రకటనల బడ్జెట్‌ను పెంచే అవకాశం ఉందే తప్ప తగ్గించే ఛాన్స్ లేదని ఆయన విశ్లేషించారు.
బ్రాండ్ ఫైనాన్స్‌కు చెందిన అజిమోన్ ఫ్రాన్సిస్ లెక్కల ప్రకారం.. ఈ నిషేధం వల్ల ఐపీఎల్ పై పడే ప్రభావం కేవలం 2 శాతం కంటే తక్కువగానే ఉంటుంది. ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్ల నుంచి కేవలం ఇద్దరు లేదా ముగ్గురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. కాబట్టి ఆ దేశంలో వ్యూయర్‌షిప్ తగ్గినా అది మొత్తం టోర్నీపై పెద్దగా ప్రభావం చూపదు. మొత్తానికి బంగ్లాదేశ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఆ దేశ క్రికెట్ అభిమానులకు నష్టమే తప్ప, ఐపీఎల్ ఆర్థిక స్థితిగతులకు వచ్చే ముప్పు ఏమీ లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
