KL Rahul : కేఎల్ రాహుల్‌కు ఏమైంది? వరుసగా రెండోసారి ఫెయిల్..కివీస్ వన్డే సిరీస్‌కు ముందు టెన్షన్‌లో టీమిండియా
KL Rahul : టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఫామ్ ఇప్పుడు సెలెక్టర్లకు పెద్ద తలనోప్పిగా మారింది. న్యూజిలాండ్‌తో కీలకమైన వన్డే సిరీస్ ముంచుకొస్తున్న తరుణంలో విజయ్ హజారే ట్రోఫీలో తన హోమ్ టీమ్ కర్ణాటక తరఫున ఆడుతున్న రాహుల్ వరుసగా విఫలమవుతున్నాడు.

KL Rahul : టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఫామ్ ఇప్పుడు సెలెక్టర్లకు పెద్ద తలనోప్పిగా మారింది. న్యూజిలాండ్‌తో కీలకమైన వన్డే సిరీస్ ముంచుకొస్తున్న తరుణంలో విజయ్ హజారే ట్రోఫీలో తన హోమ్ టీమ్ కర్ణాటక తరఫున ఆడుతున్న రాహుల్ వరుసగా విఫలమవుతున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు విశ్రాంతి తీసుకుంటుంటే, ఫామ్ కోసం దేశవాళీ బరిలోకి దిగిన రాహుల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.
జనవరి 3న త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కేవలం 35 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. కనీసం రాజస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌కైనా పుంజుకుంటాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మంగళవారం (జనవరి 6) జరిగిన ఈ పోరులో రాహుల్ కేవలం 25 పరుగులు చేసి చేతులెత్తేశాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌లో అతనే వికెట్ కీపర్ బ్యాటర్‌గా ప్రధాన బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి సమయంలో రాహుల్ బ్యాట్ ఝుళిపించకపోవడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.
గతంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా భారత్‌కు 2-1తో సిరీస్ విజయాన్ని అందించాడు. ఆ సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు (60, 66 పరుగులు) చేసి మంచి టచ్‌లో కనిపించాడు. అయితే ఇప్పుడు కివీస్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా తిరిగి వస్తుండటంతో, రాహుల్ కేవలం మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా జట్టును ఆదుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ ఎంతవరకు నిలబడతాడనేది ప్రశ్నార్థకంగా మారింది.
33 ఏళ్ల రాహుల్ వన్డే కెరీర్ రికార్డులు చాలా బలంగా ఉన్నాయి. 2016లో జింబాబ్వేపై అరంగేట్రం చేసిన అతను ఇప్పటివరకు 91 వన్డేల్లో 49.50 సగటుతో 3,218 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే గత 10 వన్డేల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే రావడం అతని ఫామ్ పడిపోతోందని చెప్పడానికి నిదర్శనం. వచ్చే వారం నుంచే కివీస్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్ తన బ్యాటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
