Tirumala: శ్రీవారి భక్తుల క్షేమం కోసం మహా శాంతి యోగం.. తిరుమల ప్రసన్నాంజనేయస్వామి సన్నిధిలో..
Tirumala Road Accidents: తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గోవింద నామస్మరణ మోగే రోడ్లలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విపరీతంగా పెరిగిన వాహనాల రద్దీ తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణాన్ని ప్రమాదకరంగా మార్చేస్తోంది. వరుస ప్రమాదాలతో అలెర్ట్ అయిన టీటీడీ.. ఇవాళ మహాశాంతి హోమం నిర్వహిస్తోంది..
Tirumala Road Accidents: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలకు రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలతోపాటు మొదటి ఘాట్ రోడ్డు, రెండో ఘాట్ రోడ్డు ద్వారా వాహనాల్లో తిరుమల చేరుకుంటుంటారు భక్తులు. నిత్యం వేలాది వాహనాల్లో లక్షలాది మంది భక్తులు ఏడుకొండలు ఎక్కి శ్రీవారిని దర్శించుకుంటుంటారు. కానీ.. తిరుమల ఘాట్ రోడ్లు కొన్నాళ్లుగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. తాజాగా.. ఒక్కరోజులోనే నాలుగు ప్రమాదాలు జరగటం భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే.. ఆయా ప్రమాదాలన్నీ మొదటి ఘాట్ రోడ్‌లోనే జరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వాస్తవానికి.. తిరుమలలో 12 వేల వాహనాలకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉంది. కానీ.. వీకెండ్‌లలో 30 వేలకుపైగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శని, ఆదివారాల్లో అప్ ఘాట్ రోడ్‌లో రోజూ 12 వేలకు పైగానే వాహనాల కొండెక్కినట్లు గుర్తించారు పోలీసులు. తిరుమల నుంచి తిరుపతి డౌన్ ఘాట్ రోడ్డులో 16 వేలకు పైగా వాహనాలు కిందికి దిగాయి. ఈ లెక్కన.. ఘాట్ రోడ్డులో అన్యూహంగా ట్రాఫిక్ పెరిగి.. వాహనాల మధ్య కనీస దూరం లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అతివేగం, డ్రైవింగ్‌లో అవగాహన లోపం, బ్రేకులు ఫెయిల్ లాంటి సమస్యలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య.
మరోవైపు.. తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో మలుపులు ఎక్కువ ఉండటం కూడా ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. 19 కిలోమీటర్ల మొదటి ఘాట్ రోడ్డులో 40 నిమిషాల ప్రయాణం చేయాల్సి ఉండగా.. డౌన్ కావడంతో వేగంగా రావడం.. మలుపుల వద్ద డ్రైవింగ్ అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే.. తిరుపతి నుంచి తిరుమలకు 18 కిలోమీటర్ల రెండో ఘాట్ రోడ్డులో 28 నిమిషాల్లో ప్రయాణించాల్సి ఉండగా.. అతివేగంతో వెళ్లే వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. అంతేకాదు.. సెల్ఫీలు కోసం ఆగే వాహనదారులతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక.. వరుస ప్రమాదాల నేపథ్యంలో రవాణశాఖ అధికారులు అలెర్ట్ అయి.. వాహదారులకు అవగాహన కల్పించడంతోపాటు వెహికిల్స్ ఫిట్నెస్‌పైనా ఫోకస్ పెట్టారు.
ఇదిలావుంటే.. తిరుమల ఘాట్ రోడ్‌లోని వరుస ప్రమాదాలతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి ఘాట్ రోడ్‌లోని 7వ మైలు వద్ద ప్రసన్నఆంజనేయస్వామి ఆలయంలో మహాశాంతి హోమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్వామివారి అనుగ్రహం కోసం ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇవాళ ఉదయం 8గంటల నుంచి టీటీడీ యాగం నిర్వహిస్తోంది. మొత్తంగా.. తిరుమల రెండు ఘాట్ రోడ్లలో వరుస ప్రమాదాలు భక్తులను భయపెడుతున్నాయి. ముమ్మర తనిఖీలతో ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..