TTD: ఘాట్‌రోడ్‌లో వరుస ప్రమాదాలు… శాంతి హోమం నిర్వహించిన టీటీడీ
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల. ఏడుకొండలపై కొలువున్న వేంకటేశుడి దర్శనం కోసం ప్రతిరోజూ వేలాదిమంది తరలివస్తారు. కానీ.. ఇటీవలి కాలంలో ఆ ఏడుకొండలు ఎక్కడమంటేనే ఒకలాంటి వణుకు పుడుతోంది భక్తజనంలో. కారణం.. ఘాట్‌రోడ్‌లో వరుస ప్రమాదాలు. నివారణ కోసం అనేక రకాల కసరత్తు చేసిన టీటీడీ... ఆగమ సలహా మండలి సలహా మేరకు శాంతి హోమం కూడా నిర్వహించింది టీటీడీ.

తిరుమల ఘాట్ రోడ్‌లో వరుస ప్రమాదాలు… భక్తజనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. నివారణ చర్యలు చేపట్టినా ప్రమాదాల ధాటి తగ్గకపోవడంతో అటు టీటీడీ పాలకమండలి కూడా ఇరకాటంలో పడింది. ప్రమాదాల నివారణ కోసం ఆధ్యాత్మిక పరిష్కారం కోసం కూడా ప్రయత్నించింది. ఆగమ సలహా మండలి సలహా మేరకు శాంతి హోమం నిర్వహించింది టీటీడీ. మొదటి ఘాట్ రోడ్‌లోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆగమోక్తంగా మొదలైంది మహా శాంతి హోమం. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగింది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు పర్యవేక్షించారు.
మహా శాంతి హోమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంకల్పం చేసుకున్నారు. భగవంతుడి దయతో పెద్ద ప్రమాదాలు జరగలేదని, అన్ని శాఖలతో చర్చించి నివారణ చర్యలు తీసుకుంటున్నామని, హోమ సంకల్పం సిద్ధించి తీరుతుందని చెప్పారు ఈవో. రెండు ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరగకుండా, మానవాళి శ్రేయస్సు కోసం టిటిడి ఈ విశిష్ట హోమం నిర్వహించింది.
హోమం ముగిశాక… ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో కలశం నీటితో అభిషేకం చేశారు. గుమ్మడి కాయలు కొట్టి దిష్టి తీశారు. ఇంకోవైపు జనుల శ్రేయస్సు కోరుతూ తిరుపతిలోని TTD పరిపాలన బిల్డింగ్ గ్రౌండ్‌లో జూన్ 29 వతేదీ నుంచి జూలై 5 వరకు శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహించనున్నట్లు జేఈవో సదా భార్గవి చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..
