AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టిటిడి సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు పనుల్లో నిమగ్నమైంది. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీలోని అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించిన ఈఓ విస్తృత తనిఖీలతో సమాయత్తం చేస్తున్నారు.

Tirumala: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం..
Tirumala
Raju M P R
| Edited By: |

Updated on: Sep 22, 2025 | 3:05 PM

Share

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరిపేందుకు టీటీడీ సన్నద్దం అయ్యింది. బ్రహ్మోత్సవాలకు ఈ నెల 23 న అంకురార్పణ జరగనుంది. 24 న శాస్ట్రోక్తంగా ద్వజారోహణం జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా జరగ నున్నాయి. ఈ మేరకు టిటిడి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రత్యేక దర్శనాలపై ఆంక్షలు విధించింది. సాధారణ భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది.

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగే సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 2న చక్రస్నానం నిర్వహించేంత వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేసింది. విఐపి బ్రేక్‌ దర్శనాలు ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసిన టిటిడి భక్తులు సహకరించాలని కోరుతోంది. ఇక శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్న టిటిడి ఉన్నతాధికారులు బ్రహ్మోత్సవాల్లో విశేషమైన గరుడసేవ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులతో కలిసి వాహన మండపం నుండి తనిఖీలు ప్రారంభించి, వివిధ గ్యాలరీ ల్లోని ఎంట్రన్స్, ఎగ్జిట్ పాయింట్స్ ను పరిశీలించి సిద్ధం చేస్తున్నారు.

ఇక గరుడ సేవలో గ్యాలరీలను రెండవసారి నింపడం, తదితర భద్రతా అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రస్నానం నిర్వహించే పుష్కరిణి పనులను పూర్తి చేసిన టిటిడి పుష్కరిణి లోపలికి బయటకు వచ్చే మార్గాలను పరిశీలించి ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. టిటిడి నిఘా, భద్రతా విభాగము, పోలీసుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులను ఉచితంగా తరలించే ధర్మ రథాలను కూడా సిద్ధం చేసారు.

ఇక టిటిడి యంత్రాంగం అంతా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో నిమగ్నం కాగా మాడవీధుల్లో జరుగుతున్న పనులను టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సీసీటీవీ కంట్రోల్ రూమ్ పనితీరును పరిశీలించిన టిటిడి ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రత చర్యలపై ఫోకస్ పెట్టారు. ఇక ఈనెల 24 సాయంత్రం 5:43 నుంచి 6:15 గంటల మధ్య మీన లగ్నంలో ద్వజారోహణం, అదే రోజు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు.

ఇక 25 ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనంపై రాత్రి 7 గంటలకు హంస వాహనంపై శ్రీవారి దర్శనం భక్తులకు లభిస్తుంది. ఇక 26న ఉదయం 8 గంటలకు సీమ వాహనంపై రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి మాడవీధుల్లో విహరిస్తారు. 27న ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై ఊరేగి భక్తులను కలువిందు చేయనున్న మలయప్ప స్వామి భక్తుల కోర్కెలను తీర్చనున్నారు. ఇక 28న ఉదయం 8 గంటలకు మోహిని అవతారం లో, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 గంటల దాకా గరుడ వాహనంపై ఊరేగనున్న మలయప్ప స్వామి లక్షలాది మంది భక్తులకు దర్శనం ఇస్తారు.

29న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనంపై రాత్రి 7 గంటలకు గజ వాహనంపై దర్శనం ఇవ్వనున్న స్వామి వారు 30 న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహనంపై దర్శనం ఇస్తారు.అక్టోబర్ 1న ఉదయం 7 గంటలకు రథోత్సవం జరగనుండగా రాత్రి 7 గంటలకు అసహనంపై మలయప్ప స్వామి దర్శనం ఇస్తారు. ఇక అక్టోబర్ 2న ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం తో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.