Tirumala Pink Diamond: తిరుమల పింక్ డైమండ్ వ్యవహారంపై ఆర్కియాలజీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే!
టీటీడీలో రచ్చ రాజేసిన తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంపై క్లారిటీ వచ్చింది. మైసూరు మహారాజు తిరుమల శ్రీవారికి కానుకగా సమర్పించిన హారంలోని పింక్ డైమండ్ మాయం అయిందన్న రచ్చ అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. మహారాజు ఇచ్చిన హారంలో పింక్ డైమండ్ లేదని అది కేవలం కెంపు రాయి మాత్రమేనని తేల్చి చెప్పారు.

2018లో అప్పటి తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పింక్ డైమండ్ మాయమైందని చేసిన ఆరోపణలపై కేంద్ర ఆర్కియాలజీ విభాగం అధ్యయనం చేసింది.1945 లో మైసూరు మహారాజు శ్రీవారికి కానుకగా సమర్పించిన హారంపై ఆరా తీసింది. తిరుపతికి చెందిన మైసూర్ లోని ఎఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఈ అంశంపై లోతుగా పరిశీలించారు. మైసూరు ప్యాలెస్ లో ఉన్న రికార్డులను తిరువాభరణం రికార్డులను పరిశీలించారు. మైసూరు మహారాజుకు సంబంధించిన ప్రతి వివరాలు భద్రపరిచిన రికార్డుల్లో దాదాపు 60 కాగితాలను పరిశీలించారు.
1945 జనవరి 9న మైసూరు మహారాజు జయచామ రాజేంద్ర వడియార్ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారని, బాల్యంలో ధరించిన తన హారాన్ని స్వామివారికి కానుకగా సమర్పించినట్లు వివరాలను బయటకు తీశారు. అప్పట్లో దాని విలువ రూ. 8,500 లుగా ఉన్నట్లు రికార్డులను పరిశీలించి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్యాలెస్ డైరెక్టర్ నుంచి వివరాలు సేకరించారు. టీటీడీ అధికారులు కూడా అప్పట్లోనే రాజమాత ప్రమోదాదేవిని కలిసి శ్రీవారికి మైసూరు మహారాజు సమర్పించిన హారంలో పింక్ డైమండ్ ఉందా లేదా అన్న దానిపై ఆరా తీశారు.
మైసూరు ప్యాలెస్ లో అందుబాటులో ఉన్న రికార్డుల్లోని వివరాలు, రాజమాత ప్రమోదా దేవి ద్వారా తెలుసుకున్న విషయాలను తెలుసుకున్నారు. ఏ ఎస్ ఐ ఏపిగ్రఫీ డైరెక్టర్ పుణ్యత్వం రెడ్డి వెల్లడించిన వివరాలు ప్రకారం మైసూరు మహారాజు కానుకగా ఇచ్చిన హారంలో కెంపులు, కొన్ని రత్నాలు పొదిగి ఉన్నట్లు స్పష్టం చేశారు. రికార్డుల ప్రకారం పింక్ డైమండ్ ప్రస్తావన హారంలో లేదని తేల్చి చెప్పారు. 2018లో రాజకీయంగా కూడా రచ్చను రాజేసిన శ్రీవారి హారంలోని పింక్ డైమండ్ వ్యవహారం కెంపుగా తేలగా ఇప్పుడు మరోసారి తెరమీదికి రావడం చర్చగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




