లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన.. కట్‌చేస్తే.. కోర్టు మెట్లెక్కిన టీమిండియా మాజీ కెప్టెన్..
Sourav Ganguly: అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఇటీవల భారతదేశాన్ని సందర్శించి, కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో తన పర్యటనను ప్రారంభించారు. అయితే, మొదటి ఈవెంట్ భారీ వివాదానికి దారితీసింది, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ పేరును ఈ జాబితాలో చేర్చారు.

టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ, కోల్‌కతాకు చెందిన ఒక అర్జెంటీనా ఫుట్‌బాల్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడిపై రూ. 50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటనలో జరిగిన గందరగోళానికి తనను ముడిపెడుతూ అసత్య ఆరోపణలు చేసినందుకు గాను గంగూలీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
వివాదం నేపథ్యం..
డిసెంబర్ 13న లియోనెల్ మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం (యువ భారతి క్రీడాంగణం) సందర్శించారు. అయితే, ఆ కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారితీసింది. సరైన నిర్వహణ లేకపోవడం, భారీగా టిక్కెట్లు కొన్న అభిమానులకు మెస్సీ సరిగ్గా కనిపించకపోవడం, వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో స్టేడియంలో అభిమానులు ఆగ్రహంతో కుర్చీలు, బాటిళ్లు విసిరారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం క్షమాపణలు కూడా చెప్పింది.
గంగూలీపై ఆరోపణలు..
కోల్‌కతాలోని అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు ఉత్తమ్ సాహా, ఈ కార్యక్రమ నిర్వాహకుడు శతద్రు దత్తాకు గంగూలీ “ఏజెంట్” లేదా “మధ్యవర్తి”గా వ్యవహరించారని ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఇంటర్వ్యూలో సాహా మాట్లాడుతూ.. గంగూలీకి డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారని, బెంగాల్ క్రికెట్‌ను నాశనం చేశారని, మెస్సీ ఈవెంట్‌లో కూడా ఆయనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని తీవ్ర విమర్శలు చేశారు.
గంగూలీ స్పందన..
ఈ ఆరోపణలను గంగూలీ తీవ్రంగా ఖండించారు. తాను కేవలం ఆహ్వానితుడిగా (గెస్ట్) మాత్రమే స్టేడియానికి వెళ్లానని, ఆ కార్యక్రమ నిర్వహణతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా, దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని గంగూలీ కోల్‌కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లీగల్ నోటీసులు – రూ. 50 కోట్ల దావా..
గంగూలీ తన న్యాయవాదుల ద్వారా ఉత్తమ్ సాహాకు లీగల్ నోటీసులు పంపారు. అందులో కొన్ని డిమాండ్లను ఉంచారు:
సోషల్ మీడియా నుంచి ఆ వివాదాస్పద వీడియోను వెంటనే తొలగించాలి.
ఎటువంటి షరతులు లేకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలి.
తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు రూ. 50 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలి.
దశాబ్దాల కాలంగా తాను సంపాదించుకున్న గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై చట్టపరంగా వెనక్కి తగ్గేది లేదని గంగూలీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశం బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




