Tirupati: గత ప్రభుత్వం శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్స్‌కు భూకేటాయింపు.. రద్దు చేయాలంటూ హిందూ సంఘాల డిమాండ్

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా స్వామీజీలు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేసి.. తిరుపతి పవిత్రను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ.. తిరుపతిలో ఏంటా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ వివాదం?... హిందూ సంఘాలు, స్వామీజీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే

Tirupati: గత ప్రభుత్వం శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్స్‌కు భూకేటాయింపు.. రద్దు చేయాలంటూ హిందూ సంఘాల డిమాండ్
Hindu Groups Stage Protest Against Construction Of Mumtaz Hotel
Follow us
Raju M P R

| Edited By: Ravi Kiran

Updated on: Dec 04, 2024 | 10:31 AM

తిరుపతిలో ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు గత ప్రభుత్వ హయాంలో భూమి కేటాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. తిరుపతి అలిపిరి దగ్గర ఒబెరాయ్ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ పేరుతో ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్‌కు భూమి కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఫైవ్‌ స్టార్ హోటల్ నిర్మాణానికి 2021లో అప్పటి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 604లో 20 ఎకరాల భూమిని 90 ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది. దీనికి సంబంధించి 2021 నవంబర్ 24న జీఓ 24 జారీ చేసి.. 4 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని పేర్కొంది. ఇప్పటికే ముంతాజ్ పేరుతో హోటల్‌ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. అయితే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల, తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ ఏంటంటూ హిందూ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. శ్రీవారి పాదాల చెంత స్టార్ హోటల్ నిర్మాణాన్ని తప్పుపడుతూ హిందూ సంఘాలు కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి.

2021లో ఫైవ్‌ స్టార్ హోటల్ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌

తాజాగా తిరుపతిలో ముంతాజ్ హోటల్స్‌కు వ్యతిరేకంగా ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీలు, హిందూ సంఘాలు నిరసన చేపట్టారు. శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో తుడా కార్యాలయం ముందు బైఠాయించారు. ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గో బ్యాక్ ముంతాజ్ హోటల్స్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అలిపిరి దగ్గర ముంతాజ్‌ హోటల్ నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలన్నారు శ్రీనివాసానంద సరస్వతి. ముంతాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్ పర్మిషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

4 ఏళ్లలో నిర్మాణాల పూర్తికి సర్కార్‌ ఆదేశాలు

అలిపిరిలో ముంతాజ్‌ హోటల్‌కు అనుమతి ఇవ్వడం ద్వారా హిందువుల పట్ల గత ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని తెలియజేసిందన్నారు ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షులు అట్లూరి నారాయణరావు. ఇప్పటికే హోటల్‌ లీజు రద్దుకు టీటీడీ తీర్మానం చేయడంతో తుడా అధికారులు కూడా స్పందించి నిర్మాణాలు నిలిపివేతకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

ముంతాజ్‌ హోటల్స్‌ వివాదంపై టీటీడీ ఫోకస్‌

వాస్తవానికి.. హిందూ సంఘాల ఆందోళనల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముంతాజ్‌ హోటల్స్‌ వివాదంపై టీటీడీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. గత నెలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించి.. ముంతాజ్‌ హోటల్స్‌ నిర్మాణంతో తిరుపతి పవిత్రత దెబ్బతింటుందని తీర్మానించింది. లీజు రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే.. టీటీడీ విజ్ఞప్తిపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న వేళ స్వామీజీలు, సాధు సంఘాలు ఆందోళన దిగాయి. ఈ క్రమంలో.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..