AP Assembly Elections: పొత్తులపై చంద్రబాబు స్పష్టత.. ఎవరికి ఎన్ని స్థానాలంటే..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం-జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఎన్నికల కోసం రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్ధుల మొదటి విడత జాబితాను ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం-జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఎన్నికల కోసం రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్ధుల మొదటి విడత జాబితాను ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రకటించారు. మొత్తం 99 స్థానాలకు ఫస్ట్ లిస్ట్‌లో అభ్యర్దులను ప్రకటించారు. అటు జనసేన 24 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక మొదటి విడత జాబితాలో తెలుగుదేశం పార్టీ 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా.. జనసేన 5 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. అయితే రాష్ట్ర భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ కూడా తమతో కలిసి వస్తుందని ఎప్పటి నుంచో చెప్పకొస్తున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.
ఎట్టకేలకు ఈ పొత్తుల అంశం కొలిక్కి వచ్చింది. మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసారు చంద్రబాబు-పవన్ కళ్యాణ్. గురువారం రాత్రి ఓసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మరోసారి శనివారం అమిత్ షాతో భేటీ అయ్యారు ఇద్దరు నేతలు. ఇప్పటికే జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉండగా.. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీయేలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. 2018లో అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది. తాజాగా మరోసారి ఎన్డీయేతో జతకట్టనుంది టీడీపీ. దీనికి సంబంధించి శనివారం జరిగిన చర్చలు ఫలించాయని టీడీపీ నేతలు ప్రకటించారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పార్టీ ముఖ్యనేతలతో పొత్తుల విషయంపై స్పష్టత ఇచ్చారు. పొత్తు ఖరారయిందని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేసారు. అందరితోనూ కలిసి పనిచేయాలని టీడీపీ నేతలకు దిశానిర్ధేశం చేసారు. అంతేకాదు ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చేసారు. దీంతో ఇంతకాలం ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది.
ఉమ్మడి బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరు..
తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో ఢిల్లీ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, పొత్తుల అంశంతో పాటు కీలక వివరాలను వెల్లడించారు. మొత్తం 175 స్థానాలకుగాను జనసేన-బీజేపీకి 30 అసెంబ్లీ సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇక 8 లోక్ సభ స్థానాలు కూడా కేటాయించినట్లు చెప్పారు. అయితే ఇప్పటికే జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ లెక్క ప్రకారం చూస్తే బీజేపీకి 6 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏయే స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందనేది రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఈనెల 17న చిలకలూరిపేటలో టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ సభ నిర్వహిస్తామని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా చేరడంతో మూడు పార్టీలు కలిసి బహిరంగ సభ నిర్వహిస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరవుతారని చంద్రబాబు పార్టీ నేతలకు తెలిపారు. అయితే ఈ సభలోనే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా బీజేపీ కూడా జతకట్టడంతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల ఉంటుందా వాయిదా పడుతుందా అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. ఇక ప్రధాని హాజరయ్యే సభ కావడంతో కొంచెం ఆలస్యమైనా భారీగా ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు దిశానిర్ధేశం చేసారు. అయితే ఎప్పటి నుంచో పొత్తుల విషయంలో అనేక రకాల చర్చలు జరిగినప్పటికీ తాజాగా పొత్తులు ఖరారు కావడంతో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..