AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న ఇద్దరు సీఎంలు..

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జల వివాదం తీవ్ర రూపం దాల్చింది. పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముందుకెళ్తుండగా, కృష్ణా జలాల వాటాపై తెలంగాణ గట్టిగా నిలబడుతోంది. పాలమూరు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయం వేడెక్కింది. రెండు రాష్ట్రాల నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెస్తూ, తమ తమ వాటాల కోసం పోరాడుతున్నారు.

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న ఇద్దరు సీఎంలు..
Ap And Telangana Water Dispute
Krishna S
|

Updated on: Dec 20, 2025 | 7:42 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి జలాలపై పొలిటికల్ మంటలు ఎగిసిపడుతున్నాయి. పోలవరం-నల్లమల సాగర్‌పై తగ్గేదే లేదని ఏపీ చెబుతుంటే.. తెలంగాణ వాటా వదులుకునే ప్రసక్తే లేదని తెలంగాణ అంటుంది. ప్రస్తుతం ఏపీ – తెలంగాణ మధ్య నీళ్ల లొల్లి ముదిరింది. పోలవరం-నల్లమల సాగర్ పై ముందుకే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఏపీ సర్కార్ చెబుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం-నల్లమల సాగర్ కట్టి తీరుతామని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అనుమతులు, నిధుల మంజూరుకు సహకరించాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన చంద్రబాబు.. నదుల అనుసంధానం నీటి వినియోగంపై చర్చించారు.

పోలవరం-నల్లమలసాగర్‌కు వీలైనంత త్వరగా క్లియరెన్స్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో సముద్రంలోకి వృథాగా పోయే నీటినే తాము వినియోగించుకుంటామని చెబుతున్నారు. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్ట్ అనుమతుల కోసం ఏపీ సర్కార్ ఢిల్లీలో మంత్రాంగం నడిపిస్తుంటే.. తెలంగాణలో కృష్ణాజలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వార్ జరుగుతోంది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటిబొట్టును కూడా వదులుకునే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మరోవైపు బీఆర్ఎస్.. కృష్ణాజలాల కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్‌ రెడ్డితో భేటీఅయిన కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులపై చర్చించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 35 TMCల కేటాయింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవడం దురదృష్టకరమన్నారు. గతంలో 90 TMCల నీటిని వాడుకోవాలని ఈ ప్రాజెక్టును డిజైన్ చేశామని, ఇప్పుడు సగానికి తగ్గించారంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అటు గోదావరి జలాల కోసం పోరాటానికి మరో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతు చేసి ఆయకట్టు నీరందించాలన్న డిమాండ్‌తో ఆందోళన చేపట్టనున్నారు.