AP Politics: నెల్లూరులో తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్.. ఆ స్థానం నుంచి బరిలో ఆనం
అయన ఒకటి కోరితే.. అధిష్ఠానం మరొకటి తలచింది. ఇక్కడి కంటే అక్కడే బాగుంటుందని సూచించింది. చివరకు పార్టీ నిర్ణయానికే ఓకే చెప్పారు ఆ సీనియర్ లీడర్. ఈ నిర్ణయంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మూడు నియోజకవర్గాలకు పీఠముడి వీడినట్టే అనే భావనలో ఉంది టీడీపీ అధిష్ఠానం. ఇంతకీ ఎవరా నేత ? ఆ ఒక్క నిర్ణయంతో మూడు నియోజకవర్గాలకు లింకేంటి?
గత ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకటగిరి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆనం రామానారాయణరెడ్డి.. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ వార్తల్లోకి ఎక్కేవారు. ఏడాది క్రితం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో బరస్ట్ అయ్యారు. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలతో సస్పెన్షన్‌కి గురయ్యారు ఆనం.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఆనం కూడా అప్పుడు టీడీపీకి దగ్గరయ్యారు. అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలు, లోకేష్ ప్రోగ్రామ్స్‌లో యాక్టివ్‌గా ఉంటూ మళ్లీ వెంకటగిరి టికెట్ ఆశించారు. టీడీపీ మొదటి లిస్ట్‌లోనే తన పేరు ఉంటుందని ఆశించారు. అయితే కోటంరెడ్డికి సీటు కన్ఫామ్ అయింది కానీ.. ఆనం పేరు ప్రకటించలేదు. దీనికి కారణం ఆనంకి నియోజకవర్గం ఖరారు కాకపోవడమే. 2009లో ఆత్మకూరు నుంచే ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ సమీకరణాల్లో భాగంగా వెంకటగిరికి మారారు. ఇప్పుడు టీడీపీలో చేరిన తర్వాత కూడా అదే సీటు ఆశించారాయన.
ఆత్మకూరుకు వెళ్లాలని టీడీపీ అధిష్ఠానం సూచన
అయితే అధిష్టానం మాత్రం ఆనం అవసరం ఆత్మకూరులో ఎక్కువగా ఉందని భావించి.. అక్కడికే వెళ్లాలని సూచించింది. ఆత్మకూరుకు వెళ్లని పక్షంలో సర్వేపల్లికి పంపిస్తే ఎలా ఉంటుందనే దానిపై టీడీపీ సర్వే కూడా చేయించింది. కానీ చివరకు ఆత్మకూరు అయితేనే కరెక్ట్ అని టీడీపీ భావించింది. దీనిపై మొదట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోని ఆనం.. ఇప్పుడు మనసు మార్చుకుని పోటీకి అంగీకరించారు.
ఆత్మకూరులో పోటీకి ఆనం ఒప్పుకోవడానికి ఇంకో బలమైన కారణం కూడా ఉందట. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆర్ధికంగా బలమైన నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్న కారణంగా.. ఆత్మకూరులో అండగా ఉంటారనే భరోసాతోనే పోటీకి సిద్ధమయ్యారట.
సీనియర్ పొలిటీషియన్ అయిన ఆనం.. సంతృప్తి చెందడంతో.. నెల్లూరులో తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్‌లో ఉన్నారట. ఆనం ఆత్మకూరు వెళ్తే.. సర్వేపల్లిలో సోమిరెడ్డి పోటీకి లైన్ క్లియర్ అయినట్టే.. ఇక వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ లేదంటే డాక్టర్ మస్తాన్‌లో ఎవరో ఒకరికి సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..