ఒక కిలోమీటర్ నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి.. 99శాతం మందికి ఈ లెక్క తెలియదు..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఊబకాయం ఒక ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గడానికి చాలా మంది జిమ్‌లు, కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. అయితే వీటన్నింటికంటే నడక అత్యంత ప్రభావవంతమైన మార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పరుగెత్తడం కంటే నడక వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
Updated on: Dec 20, 2025 | 7:22 AM

ఫిట్‌నెస్ పట్ల అవగాహన ఉన్నవారు ప్రతిరోజూ ఇన్ని అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ ఒక కిలోమీటరు దూరం నడవడానికి సగటున ఎన్ని అడుగులు పడతాయనే విషయంపై చాలా మందికి స్పష్టత ఉండదు. సాధారణంగా ఒక కిలోమీటరు నడవడానికి 1,250 నుండి 1,550 అడుగులు పడతాయి. ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి సగటున ఒక కిలోమీటరుకు 1,400 అడుగులు వేస్తాడని అంచనా.

ప్రతి వ్యక్తికి ఒక కిలోమీటరులో వేసే అడుగుల సంఖ్య ఒకేలా ఉండదు. ఇది ప్రధానంగా కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎత్తు ఎక్కువగా ఉన్నవారి అడుగుల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు తక్కువ అడుగుల్లోనే కిలోమీటరు పూర్తి చేస్తారు.

మనం ఎంత వేగంగా నడుస్తున్నాం అనే దానిపై కూడా అడుగుల లెక్క మారుతుంది. పురుషులు, స్త్రీల అడుగుల మధ్య దూరం మారుతూ ఉంటుంది. కాబట్టి వారి అడుగుల సంఖ్యలో వ్యత్యాసం కనిపిస్తుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 10,000 అడుగులు నడవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఈ లెక్కన మీరు రోజుకు 10,000 అడుగులు నడిస్తే దాదాపు 7 నుండి 8 కిలోమీటర్ల దూరం పూర్తి చేసినట్లు అర్థం. ఒకవేళ మీరు అంత నడవలేకపోతే కనీసం 5,000 అడుగులతో ప్రారంభించడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

నడక వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పరుగుతో పోలిస్తే నడక వల్ల కీళ్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అందుకే ఇది అన్ని వయసుల వారికి అనువైన వ్యాయామం.




