AP Politics: 2018లో ఎందుకు బ్రేకప్ అయింది? 2024లో ఏ లక్ష్యంతో ఒక్కటయ్యారు?
ఏపీలో మరోసారి పొత్తు పొడిచింది.. 2014 నాటి మిత్రులు మళ్లీ ఒక్కటయ్యారు. ఇప్పటికే టీడీపీ-జనసేన జట్టు కట్టగా.. తాజాగా బీజేపీతోనూ స్నేహం ఖరారైంది. రాష్ట్రంలో టీడీపీ-సేన అధికారంలోకి రావాలి.. కేంద్రంలో బీజేపీ దాని మిత్రపక్షాలకు తిరుగులేని విధంగా సీట్లు కావాలి. మొత్తానికి మూడు పార్టీల రాజకీయ ప్రయోజనాలు మళ్లీ వారిని ఒక్కటి చేశాయి. తెలుగురాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి మరీ పొత్తులు పెట్టుకుంటున్నారని ప్రత్యర్ధులు విమర్శలు ఎక్కుపెడుతుంటే.. ప్రజాప్రయోజనాల కోసమే మళ్లీ కలుస్తున్నామంటోంది టీడీపీ.
గడిచిన నెలరోజులుగా నలుగుతున్న పొత్తుల వ్యవహారంలో ఇవాళ క్లారిటీ వచ్చింది. ఎన్డీయేలోకి టీడీపీ ఎంట్రీ ఖాయమైంది. తాజాగా ఉమ్మడి ప్రకటన కూడా వచ్చేసింది. మూడురోజులుగా హస్తినలో మకాం వేసిన చంద్రబాబునాయుడు రెండుసార్లు అమిత్‌షాతో చర్చలు జరిపి పొత్తులు ఫైనల్ చేశారు. ప్రత్యర్ధులు ఎంతమంది కలిస్తే అంత బలం తమకు ఉన్నట్టేనని వైసీపీ చెబుతోంది. మూడు పార్టీలు కలిసినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో పార్టీ సీనియర్లు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కేడర్‌కు భరోసా ఇచ్చారు. అటు మాటమీద నిలబడిన చరిత్ర చంద్రబాబు జీవితంలో లేదని… తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి ఢిల్లీలో తాకట్టుపెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని.
2018లో బీజేపీతో పొత్తుపెట్టుకున్నందుకు లెంపలేసుకుంటున్నామన్న చంద్రబాబు, పాచిపోయిన లడ్డూ ఇచ్చారన్న పవన్ కల్యాణ్ ఇద్దరూ బీజేపీ చుట్టూ తిరగడం దురదృష్టకరమంటోంది కాంగ్రెస్ పార్టీ. ఎవరి ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలీ.
అయితే పార్టీ కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యాయంటోంది టీడీపీ. విభజన హామీల విషయంలో కట్టుబడి ఉన్నామని.. గతంలో ఎన్డీయేలో ఉండటం వల్లే రాష్ట్రాన్ని ప్రాజెక్టులు తీసుకురాగలిగామన్నారు ఎంపీ కనకమేడల. అటు ఎన్డీయేలో టీడీపీ-జనసేన చేరడంతో బలమైన కూటమిగా ఉండగా… ఇప్పటికే కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలు కలిపి మరోవైపు అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. ఇక సింహం సింగిల్ అంటూ మొదటి నుంచి చెబుతున్న వైసీపీ ఓ వైపు వస్తోంది. త్రిముఖపోటీలో అంతిమవిజయం ఎవరిదో? చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..