- Telugu News Photo Gallery What Happens to Your Body if You Stop Eating Meat for 30 Days, Check Details
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
సాధారణంగా చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో చాలామంది వీగన్ లేదా శాఖాహారులుగా మారుతున్నారు. ఒకవేళ మీరు క్రమం తప్పకుండా మాంసం తినే అలవాటు ఉండి.. సడెన్‌గా ఒక నెల రోజుల పాటు మాంసాహారాన్ని పక్కన పెడితే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల ఏమంటున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 20, 2025 | 12:40 PM

వాపు తగ్గుతుంది: ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్‌లో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపుకు కారణమవుతాయి. నెల రోజుల పాటు వీటికి దూరంగా ఉండటం వల్ల శరీరంలో అంతర్గత వాపులు తగ్గి, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తప్పుతుంది.

మెరుగైన పేగు ఆరోగ్యం: మాంసం కంటే మొక్కల ఆధారిత ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 30 రోజుల పాటు తృణధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థలో మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధి చెంది, పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మలబద్ధకం నుండి విముక్తి: మాంసంలో ఫైబర్ ఉండదు. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దానికి బదులుగా కూరగాయలు, చిక్కుళ్లు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోయి జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

ప్రోటీన్ లోపం - శక్తి మాంసం ద్వారా శరీరానికి అందే ప్రోటీన్, ఐరన్ అకస్మాత్తుగా అందకపోవడం వల్ల ప్రారంభంలో కొంచెం నీరసంగా లేదా అలసిపోయినట్లు అనిపించవచ్చు. మాంసం మానేసినప్పుడు ప్రోటీన్ లోటును భర్తీ చేయడానికి పప్పు ధాన్యాలు, సోయా, పనీర్ లేదా గుడ్లు వంటి ఇతర ప్రోటీన్ ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది.

ఒకేసారి మానేయవచ్చా: అకస్మాత్తుగా మాంసాన్ని పూర్తిగా వదిలేయడం కంటే క్రమక్రమంగా తగ్గించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అకస్మాత్తుగా మారడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక ఇబ్బంది కలగవచ్చు. మాంసానికి ప్రత్యామ్నాయంగా సమతుల్య ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.




