ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
Morning vs Night Shower: ఉదయం స్నానం శరీరానికి ఉత్సాహం, మెదడుకు ఉత్తేజం ఇస్తే, రాత్రి స్నానం అలసటను దూరం చేసి ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. రక్త ప్రసరణ పెంచడానికి, చర్మాన్ని శుభ్రపరచడానికి, నిద్రలేమిని తగ్గించడానికి ఈ రెండు సమయాల్లో స్నానం ఎలా సహాయపడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

స్నానం చేయడం వల్ల కేవలం శరీరం శుభ్రపడటమే కాదు.. మనసుకు ప్రశాంతత, శరీరానికి ఉత్సాహం లభిస్తాయి. కొందరు సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే మరికొందరు ఆఫీసు నుంచి వచ్చాక రాత్రి వేళ స్నానం చేయడానికి మొగ్గు చూపుతారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఉదయం, సాయంత్రం స్నానం చేయడం వల్ల వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఉదయం స్నానం: ఉత్సాహవంతమైన ప్రారంభం
మీరు రోజంతా చురుగ్గా ఉండాలనుకుంటే ఉదయం స్నానం చేయడం ఉత్తమం. ఉదయం స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి మెదడు ఉత్తేజితమవుతుంది. ఇది సోమరితనాన్ని వదిలించి, రోజును శక్తివంతంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. రాత్రంతా నిద్రిస్తున్నప్పుడు చర్మంపై పేరుకుపోయిన నూనెలు, మలినాలను తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఉదయం చల్లని నీటితో స్నానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఆ రోజంతా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది.
రాత్రి స్నానం: ప్రశాంతమైన నిద్ర
రోజంతా పని చేసి అలసిపోయిన వారికి రాత్రి స్నానం ఒక వరం లాంటిది. ఆఫీసు పని లేదా బయట తిరిగి వచ్చిన తర్వాత కలిగే శారీరక అలసటను వెచ్చని నీటి స్నానం ఇట్టే మాయం చేస్తుంది. ఇది కండరాల నొప్పిని తగ్గించి శరీరానికి విశ్రాంతినిస్తుంది. నిద్రపోయే ముందు స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గి, గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది. బయట తిరగడం వల్ల చర్మంపై చేరిన దుమ్ము, కాలుష్య కణాలు, మేకప్, చెమటను తొలగించడానికి రాత్రి స్నానం చాలా ముఖ్యం. దీనివల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.
నిపుణులు ఏమంటున్నారు?
స్నానం చేసే సమయం అనేది పూర్తిగా మీ దినచర్యపై ఆధారపడి ఉంటుంది. మీరు ఉదయాన్నే జిమ్‌కు వెళ్లే వారైతే వర్కవుట్ తర్వాత స్నానం చేయడం ముఖ్యం. ఒకవేళ కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసే వారైతే రాత్రి పూట స్నానం తప్పనిసరి. కొన్నిసార్లు ఈ రెండు సమయాల్లో స్నానం చేయడం వల్ల శరీరం, మనస్సు సమతుల్యంగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








