AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: భర్త ప్రోత్సాహంతో.. రోజు కూలి పనులకు వెళ్తూనే.. కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన మహిళ

చిన్నప్పటినుంచి భారతికి చదువంటే ఎంతో ఇష్టం. భారతి తల్లిదండ్రులకు మొదటి సంతానం. మరో ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. పేదరికం.. ఆర్ధిక ఇబ్బందులతో ఇంటర్‌తోనే చదువుకు స్వస్తి పలికింది. తల్లిదండ్రులు మేనమా శివప్రసాద్‌కి ఇచ్చి పెళ్లి జరిపించారు. తన కోర్కెను ఏనాడూ భర్తకు చెప్పుకోలేదు. అయినా అతను ఆమె మనసులోని కోర్కెను గుర్తించాడు.

Success Story: భర్త ప్రోత్సాహంతో.. రోజు కూలి పనులకు వెళ్తూనే.. కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన మహిళ
Daily Wage Worker Phd
Surya Kala
|

Updated on: Jul 18, 2023 | 3:03 PM

Share

పట్టుదల ఉండాలే కానీ, పేదరికం అభివృద్ధికి అవరోధం కాదని నిరూపించింది ఓ దినసరి కూలీ. అవును అన్ని సదుపాయాలూ ఉన్నా ఇంకా ఏదో కావాలని, కాలాన్ని వృధా చేస్తుంటారు కొందరు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని ఓ మహిళ చదువుపై తనకున్న మక్కువతో రాత్రీ, పగలూ కష్టపడి కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసింది. అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే మారుమూల గ్రామానికి చెందిన సాకే భారతి అనే మహిళ ఎలాంటి కోచింగ్‌లు, ఎక్‌స్ట్రా క్లాసులు లేకుండానే పీహెచ్‌డీ సాధించారు. నిత్యం కూలి పనులకు వెళ్తూనే ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా తన కల నెరవేర్చుకున్నారు.

చిన్నప్పటినుంచి భారతికి చదువంటే ఎంతో ఇష్టం. భారతి తల్లిదండ్రులకు మొదటి సంతానం. మరో ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. పేదరికం.. ఆర్ధిక ఇబ్బందులతో ఇంటర్‌తోనే చదువుకు స్వస్తి పలికింది. తల్లిదండ్రులు మేనమామ శివప్రసాద్‌కి ఇచ్చి పెళ్లి జరిపించారు. తన కోర్కెను ఏనాడూ భర్తకు చెప్పుకోలేదు. అయినా అతను ఆమె మనసులోని కోర్కెను గుర్తించాడు. ఆమెను పై చదువులకు ప్రోత్సహించాడు. కూలికి వెళ్తూనే అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. ఆప్పటికే వారికి ఓ ఆడపిల్ల పుట్టింది.

చిన్నారి ఆలనాపాలనా చూస్తూనే మరోవైపు చదువుని కొనసాగించింది. అంతేకాదు అదే సమయంలో కుటుంబం పోషణ కోసం పనులను కూడా చేసేది. ప్రతిరోజూ కాలేజీకి వెళ్లడానికి 8 కిలోమీటర్లు నడిచి వెళ్లేది. అక్కడ బస్సు ఎక్కి మరో 28 కిలోమీటర్లు ప్రయాణించి కాలేజీకి వెళ్లేది. ఆమె శ్రమ, పట్టుదల చూసి టీచర్లు, ఆమె భర్త కూడా పీహెచ్‌డీ చేయాలని ప్రోత్సహించారు. వారి సంకల్పం ఫలించింది.

ఇవి కూడా చదవండి

భారతికి ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎంసీఎస్‌ శుభ దగ్గర బైనరీ మిక్చర్స్‌ అంశంపై రీసెర్చ్ చేసే అవకాశం దొరికింది.  రీసెర్చ్ చేయడానికి భారతికి వచ్చిన ఉపకార వేతనం కొంత ఉపయోగపడింది. అయినప్పటికీ మరోవైపు కూలి పనులకు వెళ్తూనే ఉంది. డాక్టరేట్‌ చేస్తే వర్సిటీ స్థాయిలో మంచి ఉద్యోగం దొరుకుతుంది. అది తమ  జీవితాల్ని బాగు చేస్తుందని భావించింది. అంతేకాదు తాను నేర్చుకున్న జ్ఞానాన్ని మరెంతో మందికి పంచొచ్చుని అనుకుంది. అంతేకాదు తాను కష్టపడి పిహెచ్ డీ సాధిస్తే తనలాంటి మరికొందరికి ప్రేరణగా నిలుస్తుందని భావించింది. ఈ ఆలోచనలే తనను ముందుకు నడిపించాయని భారతి చెప్పింది. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భర్త, బిడ్డతో కలిసి పీహెచ్‌డీ పట్టా అందుకుంది భారతి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..