Andhra News: పాము కాటేస్తే మంత్రగాళ్లు , నాటు వైద్యుల వద్దకు వెళ్తున్నారా..? జాగ్రత్త సుమీ
ఇప్పటికీ చాలా మంది వాహనదారులు రోడ్డు క్రాస్ చేసే పామును వేగంగా వెళ్తూ తొక్కేస్తే మరుసటి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివాలయం, నాగదేవత ఆలయాలకంటూ వెళ్లి తాయెత్తు కట్టించుకుంటారు. పూజలు చేసి అక్కడ ఇచ్చే విభూది, పసుపు, కుంకుమ తమ ఇంటి చుట్టూ జల్లుతారు.

Eluru, 18th July: వర్షాకాలం మొదలైంది. దీంతో గడ్డి వాములు, పొలం గట్లు, పంట పొలాలు వద్ద పాములు సంచారం పెరిగింది. దీంతో పల్లె వాసులు ముఖ్యంగా పాములంటే హడలిపోతున్నారు. ముఖ్యంగా తొలకరి చినుకులు పడుతున్న సమయంలో పాములు పుట్టల్లో పెట్టిన గుడ్లు పగిలి పిల్లలు బయటకు వస్తుంటాయి. ఆహారం కోసం వెతుకుతూ పొలాలు, సమీపంలోని నివాసాల్లోకి అవి విచ్చేస్తుంటారు. అయితే రైతులు, వ్యవసాయ కూలీలు, పశుపోషణ చేసేవారికి పాముల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంటాయి. గట్లపై నడుచుకుంటూ నీటి మోటారు స్విచ్ ఆన్ చేద్దామని ప్రయత్నించే క్రమంలో చీకటిలో ఉన్న పాము కరుస్తుంది. అలాగే పశువులకు గడ్డి వేసేందుకో, పచ్చగడ్డి కోసేందుకో వెలితే అందులో నక్కి ఉన్న పాము కాటువేస్తుంది. దీంతో తరుచుగా వీటి బారిన పడి సకాలంలో వైద్య సేవలు అందుక కొందరు మృత్యువాత పడుతుంటే.. మరికొందరు సరైన సమయంలో చికిత్స తీసుకుని ప్రాణాలు దక్కించుకోగలుగుతున్నారు.
మంత్రాలకు చింతకాయలు రాలవు
పూర్వం పాములు పగపడతాయని, వాటికి హాని కలిగిస్తే వెంటపడి మాటు వేసి పగ తీర్చుకుంటాయనే మూడ నమ్మకం ఎక్కువగా ఉండేది. పొలాల్లో చెత్త తగలవేసే క్రమంలో, పొలాలు చదును చేసినపుడు బయటకు వచ్చే పాములను కొట్టి చంపేస్తారు. అయితే దెబ్బలు తప్పించుకున్న పాము తమకు హాని చేసిన వారి ఇళ్లకు వెళ్లి చంపేస్తుందని పలువురు నమ్మేశారు. కాని ఇదంతా మూఢనమ్మకం అని తేలిపోయింది. అయితే ఇప్పటికీ చాలా మంది వాహనదారులు రోడ్డు క్రాస్ చేసే పామును వేగంగా వెళ్తూ తొక్కేస్తే మరుసటి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివాలయం, నాగదేవత ఆలయాలకంటూ వెళ్లి తాయెత్తు కట్టించుకుంటారు. పూజలు చేసి అక్కడ ఇచ్చే విభూది, పసుపు, కుంకుమ తమ ఇంటి చుట్టూ జల్లుతారు. అయితే మంత్రాలకు చెట్టుకు ఉన్న చింతకాయలు రాలవన్న సామెత మాదిరిగా మంత్రాలు వేస్తే విషం విరగటం మనిషి బ్రతికి బయటపడటం జరిగదని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా వేలాది మంది పాము కరిచి ఆసుపత్రి పాలవుతున్నారు. మూడు నమ్మకాలతో మంత్రాలను నమ్ముకుని కొందరు ప్రాణలమీదకు తెచ్చుకుంటున్నారు.
గోదావరి జిల్లాల్లో పాములు విషపూరితమైనవా
ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో గిరినాగులు చాలా విషపూరితమైనవి, అలాగే ప్రమాదకరమైనవి. సకాలంలో వైద్యం అందకపోతే. మనిషి మరణించడం ఖాయం. అయితే గిరినాగులు ఇప్పుడు చాలా అరుదుగా కన్పిస్తున్నాయి. ఇక కొండ చిలువలు ఏజెన్సీ తో పాటు చేపలు చెరువులు, అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ఇవి చేపలు వలకు చిక్కటంతో కొల్లేరు లోనూ వీటి సంచారం తరుచుగా కనిపిస్తుంది. “పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన స్నేక్ క్యాచర్ క్రాంతి ” చెబుతున్న వివరాలు ప్రకారం గోదావరి జిల్లాల్లో విషము కలిగిన పాములు నాలుగు రకాలు ఉన్నాయి. వీటిలో మొదటిది త్రాచు పాము, రెండోది కట్ల పాము, తర్వాత పొడ పాము, చివరిగా నాలుగోది రక్త పింజర పాముల సంచారం ఉంది. వీటి బారిన పడితే కరిచిన పామును బట్టి సరైన మందులు , యాంటీ వీనం ఇంజెక్షన్లు చేయించుకోవాలి. మిగిలిన పాముల జాతుల్లో.. ఏ పాము కరిచినా పెద్దగా ఏమీ ఉండదు, భయపడాల్సిన పని లేదు. విషరహిత సర్పాలు కాటు వేసిన వారికి , ఫస్ట్ ఎయిడ్ లంటి మామూలు వైద్యం చేస్తే సరిపోతుంది. ఐతే.. కొన్ని సందర్భాలలో కాటు వేసింది ఏ రకం పామో తెలియకపోవచ్చు. అలాంటి పరిస్థితి ఎదురైతే రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. పాముకాటు వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళడం మంచిది.
పాము కాటుకు గురి అయిన వ్యక్తి, విష ప్రభావంతో కంటే భయంతో చనిపోయిన సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటి కేసుల్లోనే మంత్రగాళ్లు , నాటు వైద్యులు సక్సెస్ అయితే అవుతారు. వారు పాముకాటు బాధితునిలో భయం పోగొట్టగలరేమో గాని, ఒంట్లోకి చేరిన విషాన్ని ఏమీ చేయలేరు. అందుకే ఏ పాము కరిచినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సరైన వైద్యుని దగ్గరకు తీసుకువెళ్లటం ఉత్తమం. పాము కాటుకి విరుగుడుగా ఇచ్చే మందు “యాంటీ వీనం” ఇది ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. కానీ ప్రవేట్ హాస్పటల్ యాజమాన్యంతో కొందరు ప్రభుత్వ డాక్టర్లు కుమ్మక్కై మెడిసిన్ ఉన్నా లేవని చెప్పి సామాన్యులు దగ్గర దోచుకుంటున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
