AP News: రౌడీ కోతులు – కేడీ కుక్కలు… వణికిపోతున్న ఆ ఊరు
ఆ ఊరిని కుక్కలు, కోతులు ఏలేస్తున్నాయి. ప్రాంతాల వారీగా పంచుకుని జనాలను భయపెడుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...
ఆ ఊళ్లో జనం కంటే ఎక్కువగా కోతులు, కుక్కలే దర్శనమిస్తున్నాయి… దీంతో జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు… అలాగని ఇంట్లో కూర్చుంటే కోతుల బెడద అక్కడ కూడా తప్పడం లేదు… వందల కోతులు మందలు మందలుగా గ్రామంలోకి వచ్చి పడటంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు… వచ్చిన కోతులు జనాల మీదకు ఎగబడుతూ రౌడీయిజం చేస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు… అందినకాడికి ఆహారపదార్దాలు ఎత్తుకెళ్లిపోతున్నాయట.. దీనికి తోడు కుక్కలు కూడా వీధుల్లో స్వైరవిహారం చేస్తున్నాయి… పంచాయతీ అధికారులకు కూడా కోతులు, కుక్కల బెడదను తప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు…
ప్రకాశంజిల్లా యర్రగొండపాలెంలో కోతులు, కుక్కల బెడదతో ప్రజలు సతమతమవుతున్నారు… జనం ఇళ్ల నుంచి ఒంటరిగా బయటకు రావాలంటే బెదిరిపోతున్నారు… ముఖ్యంగా చిన్నారులను ఒంటరిగా ఎవరూ బయటకు పంపడం లేదు… పనుల కోసం బయటకు వస్తే వీధుల్లో, రహదారుల్లో కుక్కలు, కోతులు దాడి చేస్తాయని హడలిపోతున్నారు… ఒకటి రెండు కాదు వందల సంఖ్యలో కోతులు వీధుల్లో తిరుగుతూ ప్రజలపైకి వస్తున్నాయి… అటవీ ప్రాంతాలలో ఉండాల్సిన కోతులు నివాస ప్రాంతాలకు వచ్చి ఇళ్లలో బీభత్సం చేస్తున్నాయని, తరిమేందుకు ప్రయత్నిస్తే దాడులకు తెగబడుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… గతంలో ఇదే విధంగా కోతులు పెద్ద సంఖ్యలో గ్రామంలోకి రావడంతో పంచాయతీ సిబ్బంది కొండముచ్చులను తీసుకొచ్చి కోతులను గ్రామం నుంచి తరిమేశారు.. గత నాలుగు రోజుల నుండి తిరిగి కోతుల గుంపు రావడంతో సమస్య మళ్ళీ మొదటికొచ్చింది… ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు భయంతో బయటికి రాలేని పరిస్థితి ఉంది… ఒక వైపు కోతుల బెడదతో సతమతమవుతుంటే మరో వైపు వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాన్ని హడలెత్తిస్తున్నాయి… ఇప్పటికే పలు చోట్ల కుక్కలు కరుస్తున్నాయని జనం పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు… ప్రమాదకర పరిస్థితులు ఏర్పడి ప్రజల ప్రాణాలమీదకు రాకముందే గ్రామంలో కోతులు, కుక్కల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
యర్రగొండపాలెం సమీపంలో ఉన్న అటవీప్రాంతం నుంచి వచ్చే కోతులే కాకుండా ఎక్కడెక్కడో పట్టుకున్న కోతులను కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడుతున్నారు… దీంతో వీటి సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది… ప్రస్తుతం మందలు మందలుగా ఉన్న కోతులను సమీపంలోని అటవీప్రాంతంలోకి తరిమివేయాలంటే పంచాయతీ సిబ్బంది కొండముచ్చులను తీసుకొచ్చి వీటిని అటవీప్రాంతంలోకి తరిమేయాలని గ్రామస్తులు సూచిస్తున్నారు.