ఆలయాల చుట్టూ మహిళా మంత్రి ప్రదక్షిణ.. అసలు కారణం ఏంటంటే..
ఎన్నికల సమరంలో నెగ్గాలంటే ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఈవీఎంల్లో దాగి ఉన్న ఓటర్ల తీర్పు అనుకూలంగా ఉండాలంటే దైవానుగ్రహం కావాల్సిందే. అందుకే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థులంతా ఆధ్యాత్మిక యాత్రల్లో ఉన్నారు. పోలింగ్ కు ముందు ఓటర్ల చుట్టూ.. ఇప్పుడు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఎన్నికల సమరంలో నెగ్గాలంటే ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఈవీఎంల్లో దాగి ఉన్న ఓటర్ల తీర్పు అనుకూలంగా ఉండాలంటే దైవానుగ్రహం కావాల్సిందే. అందుకే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థులంతా ఆధ్యాత్మిక యాత్రల్లో ఉన్నారు. పోలింగ్ కు ముందు ఓటర్ల చుట్టూ.. ఇప్పుడు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అలా దేశంలోని ఆలయాలను చుట్టేస్తున్న వారిలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ముందున్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు జరిగాయి. మే 13 న పోలింగ్ ముగిస్తే జూన్ 4 న కౌంటింగ్ జరగనుంది. ఈ మేరకు విస్తృతమైన ఏర్పాట్లు జరిగి పోయాయి. కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. పోలింగ్ జరిగిన తరువాత ఓట్ల లెక్కింపుకు దాదాపు 23 రోజులు గడువు ఉండటంతో నేతలు దేశ విదేశాల్లో రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోయారు.
జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డితోపాటు కొందరు విదేశాలకు వెళ్లిపోగా, మంత్రి ఆర్కే రోజా ఆధ్యాత్మిక యాత్ర నిర్వహించారు. ఇక టిడిపి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఎన్నికల్లో గెలవాలని ఉత్తరాది రాష్ట్రాల్లోని ఆలయాలను చుట్టేస్తున్నారు. కౌంటింగ్ సమయం ఆసన్నం కావడంతో రిలాక్స్ మూడ్ నుంచి సొంత నియోజకవర్గాలకు వస్తున్నారు నేతలు. కౌంటింగ్ లెక్కల్లో బిజీ బిజీగా గడపనున్నారు. గెలుపు అవకాశాలపై బేరీజు వేసుకుంటున్నారు. ఇక దైవభక్తి ఎక్కువగా ఉండే మంత్రి ఆర్కే రోజా నామినేషన్‌కు ముందు, పోలింగ్ తరువాత కూడా ఆలయాలు చుట్టూ తిరిగారు. నగిరి నుంచి మూడోసారి గెలుపే లక్ష్యంగా వైసీపీ నుంచి ఎన్నికల బరిలో దిగిన రోజా నామినేషన్‌కు ముందు అరకు సమీపంలోని దక్షిణామూర్తి ఆలయం, తమిళనాడులోని కంచి కామాక్షి అమ్మవారిని, తిరుత్తణి సుబ్రమణ్య స్వామి ఆలయాలను సందర్శించారు.
ఇక పోలింగ్ అనంతరం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం, పుత్తూరులోని ఈశ్వర ఆలయంలో కళ్యాణం జరిపించారు. తమిళనాడులోని తిరువన్నామలైలో అరుణాచలశ్వర ఆలయాన్ని సందర్శించి గిరి ప్రతిక్షిణ చేశారు. షోలింగర్‌లోని నరసింహస్వామి దేవాలయం, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం, కర్ణాటక మురుడేశ్వరంలోని శైవక్షేత్రాలకు వెళ్లి మొక్కులు చెల్లించారు. ఎన్నికల్లో విజయం సాధించేలా దైవానుగ్రహం కోసం ప్రయత్నించారు. ఇలా ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ఎత్తులూ వేసిన అభ్యర్థులు ఆఖరిగా ఆలయాల చుట్టూ తిరుగుతూ ఇష్ట దైవం అనుగ్రహం కోసం ఆరాటపడుతున్నారు. చేసిన పూజలు, చెల్లించిన ముడుపులు, మొక్కుకున్న మొక్కులు ఫలిస్తాయా, లేక ఓటర్ల దేవుళ్ళ అనుగ్రహమే అనుకూలిస్తుందా అన్నది జూన్ 4న తెలియనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




