AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారంటూ ఫేక్‌ వీడియోతో ప్రచారం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్!

సింపతీ కోసం తన తల్లిని కరెంట్ పోల్‌కు కట్టేసి వీడియో తీసిన ఓ కుమారుడి ప్లాన్ బెడిసి కొట్టింది. ఆస్తి తగాదాల కారణంగా అవతలి వర్గం వారు తన కన్న తల్లిని కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారని డ్రామాకు తెరలేపిన కుమారుడు.. ఏకంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తప్పుడు ప్రచారం చేశాడు.

Andhra News: తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారంటూ ఫేక్‌ వీడియోతో ప్రచారం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్!
Kuppam
Raju M P R
| Edited By: |

Updated on: Jul 14, 2025 | 9:46 PM

Share

సింపతీ పొందేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బెడిసికొట్టి అతనిపై కేసు నమోదు చేసే వరకు వెళ్లింది. భూ తగాదాల కారణంగా అవతలి వర్గం వారు తన తల్లిని చెట్టుకు కట్టేసినట్టు వీడియో క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమెదు చేశారు. వీడియో తీసేందుకు సహకరించిన వ్యక్తులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కుప్పం పోలీసుల కథనం ప్రకారం..శాంతిపురం మండలం కర్లగట్ట తమ్మిగాని పల్లికి చెందిన మునెప్ప అనే వ్యక్తికి గంగమ్మ, మునెమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే ఈనెల 5న మునెప్ప అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆదివారం ఆయనకు కర్మక్రియలు పూర్తి చేశారు.

అయితే ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే మునెప్ప కుటుంబ సభ్యుల మధ్య భూ తగాదాలు మొదలయ్యాయి. మునెప్ప ఇద్దరి భార్యల పిల్లలు ఎవరికి వారు తండ్రి ఆస్తిని కొట్టేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో మునెప్ప రెండో భార్య మునెమ్మ కొడుకు మంజునాథ్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించిన మొదటి భార్య గంగమ్మ కొడుకు సురేష్ ఓ ప్లాన్ వేశాడు. తన తల్లి గంగమ్మను పిన్నమ్మ కొడుకు మంజునాథ్ స్తంభానికి కట్టేసి కొట్టాడని ప్రచారం చేసి సింపతీ పొందాలనుకున్నాడు. అనుకున్న ప్లాన్‌ ప్రకారం తన తల్లిని చెట్టుకు కట్టేసి ఓ వీడియో క్రియేట్ చేశాడు. దాన్ని సోసల్‌ మీడియాలో అప్‌లోడ్ చేసి వైరల్‌ చేయించాడు. ఈ నిందను మంజునాథ్‌ మీద నెట్టాడు. దీన్ని గమనించిన మంజునాథ్‌ పోలీసులను ఆశ్రయించాడు.

అయితే వీడియోను పరిశీలించిన పోలీసులు అది క్రియేట్ చేసిన వీడియోగా గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అవాస్తవమని పోలీసులు తేల్చడంతో సురేష్‌ అసలు బండారం బయటపడింది. వీడియో తీసి తప్పుడు ప్రచారం చేసిన సురేష్ పై కేసు నమోదు చేయాలని కుప్పం డీఎస్పీ పార్థసారథి ఆదేశించారు. వీడియో తీసేందుకు ప్రోత్సహించిన వారిపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. సీఎం నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.