AP Fiber Net scam: ఫైబర్ నెట్ స్కామ్‌పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. విచారణను సీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలు
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్ నెట్ స్కామ్ పై మరోసారి జగన్ సర్కార్ దృష్టి సారించింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై....
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్ నెట్ స్కామ్ పై మరోసారి జగన్ సర్కార్ దృష్టి సారించింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ప్రస్తుత ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఐడీ విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ నెట్ స్కామ్ పై విచారణ జరపాలని గతంలోనే సీబీఐను జగన్ సర్కార్ కోరింది. విచారణ చేపట్టే అంశంపై సీబీఐ స్పందించకపోవడంతో తాజాగా సీఐడీకి విచారణను అప్పగిస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుమారు రూ. 700-1000 కోట్ల మధ్య ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని గతంలోనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లు.. ఫైబర్ నెట్ కు సంబంధించి వివిధ టెండర్లను ఖరారు చేసే క్రమంలో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన అభియోగంగా ఉంది. టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేలా అప్పటి టీడీపీ సర్కార్ వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు పత్రాలతో ఫైబర్ నెట్లో నిబంధనలకు విరుద్దంగా నియామకాలు జరిగాయని కూడా వార్తలు వచ్చాయి. అప్పటి ఐటీ మంత్రి లోకేష్, ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణ ప్రసాద్ మీద ఈ విషయంపై ఎప్పటినుంచో జగన్ సర్కార్ ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా విచారణను వేగంగా పూర్తి చేయాలని సీఐడీని ఆదేశించింది జగన్ సర్కార్.
Also Read: విత్తనాలు వేయకముందే ఆ రైతు పంట పండింది.. ఏకంగా రూ. 30 లక్షల వజ్రం దొరికింది