AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: 100 ఏళ్ల వయసులో రోజుకు 12 కిలోమీటర్ల వాకింగ్ .. అథ్లెటిక్స్ పోటీలో పాల్గొని అద్భుతాలు సృష్టించేందుకు రెడీ అవుతున్న..

రిటైర్డ్ అయి 48 ఏళ్లు. ఏదో కృష్ణా రామ అని ఇంట్లో కూర్చోకుండా ఆ వయసులో సాధించాల్సిన విజయాలపై దృష్టి నిలిపారు. వాకింగ్, మారథాన్ వైపు దృష్టి మళ్ళించారు. నేవీ లో పదవీ విరమణ తర్వాత విశాఖ బీచ్ రోడ్డులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఉద్యోగ సమయంలో నేర్చుకున్న సెయిలింగ్, యాచింగ్ ల ప్రాక్టీస్ కు మరింత పదును పెట్టారు.

Vizag: 100 ఏళ్ల వయసులో రోజుకు 12 కిలోమీటర్ల వాకింగ్ .. అథ్లెటిక్స్ పోటీలో పాల్గొని అద్భుతాలు సృష్టించేందుకు రెడీ అవుతున్న..
Athlete Sriramulu
Eswar Chennupalli
| Edited By: Surya Kala|

Updated on: Jul 18, 2023 | 4:47 PM

Share

ఇదిగో ఈ యువ వృద్ధుడి వయసు 100 సంవత్సరాలు. అక్షరాలా నేటికి 100 యేళ్లు పూర్తి. ఈరోజే 101 వ సంవత్సరం లోకి అడుగిడిన ఈ నవ యువ వృద్దుడు వచ్చే ఏడాది విదేశాల్లో జరిగే పలు అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనడానికి సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పలు దేశాలలో జరిగిన మారథాన్, అథ్లెటిక్స్ లోలో ప్రపంచ స్థాయి పోటీలలో బంగారు పతకాలు ఎన్నో సాధించారు. ఈ వయసులోనూ ఇంత అత్యంత సామర్ద్యంగా ఉండడానికి రహస్యం ఏంటి సర్ అని అంటే.. రోజూ మూడు గంటల నడక, ఎనిమిది గంటల నిద్ర, ఎక్సర్సైజ్, మితాహారం. అదే ఒక్క రోజులో కాదు దాదాపు యాభై ఏళ్ల నుంచి క్రమం తప్పని అలవాటే తన ఆరోగ్య రహస్యం అన్నది ఈ నవ యువ యువకుడి మంత్ర.

ఇప్పుడీ పెద్దాయనకు వందేళ్లు దాటాయి. అయినా ఇప్పటికీ అదే నడక, అదే వ్యాయామం.. రోజుకి 12 కిలోమీటర్ల నడక.. ఈరోజు 101 ఏట అడుగు పెడుతున్న ఆయన వివరాలు, ఎన్నెన్నో ఆసక్తికర అంశాలను గురించి తెలుసుకుందాం..

మాస్టారి పేరు వల్లభజోష్యుల శ్రీరాములు, పుట్టింది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్యోగ రీత్యా స్థిరపడింది మాత్రం విశాఖపట్నంలో. 1923 జులై 18న మచిలీపట్నంలో వెంకట రాయుడు, కనకదుర్గ దంపతులకు జన్మించారు. డిగ్రీ వరకు మచిలీపట్నం లోనే చదివారు. 1941లో మిలటరీ అకౌంట్సు విభాగంలో ఆడిటర్ గా జాయిన్ అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రాయల్ ఇండియన్ నేవీలో చేరి కమొడోర్ స్థాయికి పదోన్నతి పొందారు. భారత నౌకాదళంలో దాదాపు 35 ఏళ్లపాటు సేవలు అందించి 1975లో పదవీ విరమణ చేశారు.

ఇవి కూడా చదవండి

అంటే రిటైర్డ్ అయి 48 ఏళ్లు. ఏదో కృష్ణా రామ అని ఇంట్లో కూర్చోకుండా ఆ వయసులో సాధించాల్సిన విజయాలపై దృష్టి నిలిపారు. వాకింగ్, మారథాన్ వైపు దృష్టి మళ్ళించారు. నేవీ లో పదవీ విరమణ తర్వాత విశాఖ బీచ్ రోడ్డులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఉద్యోగ సమయంలో నేర్చుకున్న సెయిలింగ్, యాచింగ్ ల ప్రాక్టీస్ కు మరింత పదును పెట్టారు.

వాకింగ్, మారథాన్ లలో విశాఖ లో చిన్న చిన్న ఈవెంట్స్ లో పాల్గొన్నాక, తొలిసారిగా 2010లో ఏసియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు హాజరై 5 కిలోమీటర్ల నడక తో పాటు 400, 800, 1500 మీటర్ల పరుగు పోటీల్లో పార్టిసిపేట్ చేశారు. అన్నింటిలోనూ గోల్డ్ మెడల్స్ నే సాధించారు. ఇక అక్కడ నుంచి వెనక్కితిరిగి చూడలేదు. 2011, 2015లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రెండు గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ సాధించారు. 2016 ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో మూడు గోల్డ్ మెడల్స్ ను సాధించి అథ్లెట్ ఆఫ్ ఆసియా-2016 టైటిల్ ను సాధించారు. అయినా ఇంకా తృప్తి పడని ఈ నవ యువ వృద్దుడు ఈ ఏడాది ఫిలిప్పీన్స్లో జరగనున్న ఆసియా ఛాంపియన్షిప్, వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ మారథాన్ ఛాంపియన్షి లో పాల్గొనేందుకు ప్రస్తుతం ప్రాక్టీస్ ను ముమ్మరం చేశారు. పర్వతారోహణలోనూ మన శ్రీరాములు గారికి అనుభవం ఉంది.

మన శ్రీరాములు ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసుకుందామా

శ్రీరాములు నిత్యం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య సమయంలో నిద్ర లేస్తారు. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం 3 గంటల సమయంలో నడక ప్రారంభిస్తారు. సరాసరి 12 కిలోమీటర్లు క్రమం తప్పకుండా నడుస్తారు. సూర్యుడు ఉదయించేలోగా నడక ప్రక్రియ పూర్తి చేసేస్తారు. వర్షం వల్ల నో, ఇతర కారణాల వల్లనో నడక వీలు కానీ రోజున ఇంటిలోనే వ్యాయామాలు చేస్తారు. అందుకోసం అవసరమైన జిమ్ సామగ్రిని ఇంటిలోనే సమకూర్చుకున్నారు.

అత్యంత ముఖ్యమైన ఆహారం విషయం పరిశీలిస్తే..

శ్రీరాములు పూర్తిగా వెజిటేరియన్. ఉదయం మొలకెత్తిన విత్తనాలతో అల్పాహారం, ఒక కాఫీ, మధ్యాహ్నం తక్కువ పరిమాణంలో వరి అన్నం, కూరలు, పెరుగు తో కలిపి తీసుకుంటారు. రాత్రి ఇక నో డిన్నర్. 50 ఏళ్లుగా రాత్రి భోజనం మానేసారట. మొదట్లో కొద్దికాలం వరకు రాత్రిపూట ఒక గ్లాసుడు పాలు తాగేవారటకానీ అలెర్జీ రావడంతో దాన్ని మానేసి అదే పరిమాణం లో మజ్జిగ మాత్రం తీసుకుంటున్నారట.

ఇక ఆయన కుటుంబ విషయానికి వస్తే..

శ్రీరాములు సతీమణి సత్యవతి కి ఇప్పుడు 92 సంవత్సరాలు. ఆమె కూడా షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈ దంపతులకు ఒక కుమారుడు సాగర్ అమెరికాలో వైద్యుడు గా స్థిర పడగా ఇద్దరు కుమార్తెలు సి. పద్మ బెంగళూరు లో, డాక్టర్ కె. జయ వైద్యురాలు గా యూకే లో స్థిర పడ్డారు. 101 ఏళ్ల వయసులో ఇంత ఫిట్నెస్ ఎలా అని అంటే టీవీ9 తో శ్రీరాములు మాట్లాడుతూ నాకేమీ టార్గెట్లు లేవు, ఉన్నన్నాళ్లూ హ్యాపీగా జీవించాలన్నదే లక్ష్యం. నేను ఇప్పటివరకు ఒక్కరోజు కూడా అనారోగ్యం పాలవలేదు, ఆస్పత్రి మెట్లే ఎక్కలేదు. బిపి, షుగర్ సహా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. చివరి ఘడియల్లోనూ ఆస్పత్రికి వెళ్లకూడదన్నది నా అభిమతం. తక్కువ తిని, ఎక్కువ వ్యాయామం చేస్తే ఎవరైనా నాలానే ఉంటారంటున్నారు శ్రీరాములు.

ఇదీ శ్రీరాములు సంపూర్ణ జీవిత విజయ గాథ. త్వరలో జరగబోయే అంతర్జాతీయ అథ్లెటిక్స్ కూడా శ్రీరాములు విజయం సాధించి గోల్డ్ మెడల్ సాధిస్తారని ఆశిద్దాం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..