Fake Aadhaar: నగరంలో నయా ‘నకిలీ’ గ్యాంగ్.. వాళ్లే ప్రధాన టార్గెట్.. ఆధార్ అదే కానీ..
Fake Aadhaar: ఇదో నయా తరహ మోసం..! కేసుల్లో అరెస్ట్ అయిన వారే వాళ్ళ టార్గెట్.. నకిలీ పత్రలతో షూరిటీ డాక్యుమెంట్లు సృష్టించి బెయిల్ పొందేలా చేయడమే వాళ్ల పని. బెయిల్ కోసం ఎదురు చూసే వారితో చేతులు కలిపి నకిలీ ఆధార్ కార్డులో సృష్టించి కోర్టులో బెయిల్ పొందేలా చేస్తున్న ముఠా వ్యవహారం విశాఖ పోలీసులకు ఉలిక్కిపడేలా చేసింది. ఆ ముఠా నడిపిస్తున్న వ్యవహారం ఏంటి..? ఆ కింగ్ పిన్ ఎవరు..?
Aadhaar Duplication: ఉమ్మడి విశాఖ జిల్లాలో నిత్యం పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు నమోదవుతూ ఉంటాయి. వాటిలో గంజాయి, చోరీ కేసుల సహా వివిధ రకాల కేసులు కూడా ఉంటాయి. ఆయా కేసుల్లో నిత్యం అరెస్టై రిమాండ్‌కు వెళుతూ ఉంటారు నిందితులు. రిమాండ్ ఖైదీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా ఉంటున్నారు. చాలామందికి బెయిల్ పొందేందుకు అవకాశం ఉన్నా… బెయిల్ పత్రాలు సమర్పించేవారు లేకపోవడంతో నిందితులు రిమాండ్ ఖైదులుగానే ఉండిపోతారు. మరికొందరికి బెయిల్ స్యూరిటీ ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాని సందర్భాలు ఉంటాయి..
అయితే రిమాండ్ ఖైదీలు బెయిల్ పొందాలంటే ముందుగా ప్రభుత్వ ఉద్యోగి స్యూరిటీ తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఆయా అవసరాలన్నీ తామే తీరుస్తామని ఎరవేస్తుంది ఓ గ్యాంగ్. ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులతో సహా అన్ని తయారు చేసి ఒక ప్యాకేజీ పెడుతున్నారు. వాళ్లకు అందుబాటులో ఉన్నవారిని టీమ్‌లో చేర్చుకొని.. ఉద్యోగస్తుల్లా కొన్ని పత్రాలు సృష్టిస్తున్నారు. కొన్ని ఆధార కార్డులో ఫోటోలు మార్ఫింగ్ చేసి అందుబాటులో ఉన్న వ్యక్తుల ఫోటోలు అతికిస్తున్నారు. అడ్రస్ ఆధార్ నెంబర్ ఒకటే కానీ.. అందులో ఉన్న ఫోటో డిఫరెంట్. ఇలా తయారు చేసిన పత్రాలను బెయిల్ కోసం సిద్ధం చేసేసి.. కేసును బట్టి రేటు ఫిక్స్ చేస్తున్నారు.
టాస్క్ ఫోర్స్‌కు వచ్చిన సమాచారంతో..
నకిలీ డాక్యూమెంట్ల దందా గురించి విశాఖలోని టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో కూపి లాగారు. దీంతో లింకు కేజీహెచ్ పక్కనే ఉన్న తాడి వీధికి తగిలింది. అక్కడ లక్ష్మీ అనే ఓ మహిళ గుట్టుగా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్టు టాస్క్ ఫోర్స్ టీమ్ తెలుసుకుంది. అమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేసరికి… ఈ నకిలీ బెయిల్ ఫోర్జరీ పత్రాల ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లక్ష్మీ తో పాటు ఆమెకు సహకరిస్తున్న శ్రీరామ్మూర్తి, వీర కుమార్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ ఆధార్ కార్డులు, వివిధ ప్రభుత్వ ఉద్యోగుల స్టాంపులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను మహారాణిపేట పోలీసులకు అప్పగించామని టాస్క్ ఫోర్స్ ఏసిపి త్రినాధ రావు తెలిపారు
వాడే కింగ్ పిన్.. ఆచూకీ కోసం పోలీసుల వేట..!
అయితే ఈ ముఠాను నడిపేది మరో కీలక వ్యక్తి కోటేశ్వరరావుగా గుర్తించారు పోలీసులు. గుంటూరుకు చెందిన కోటేశ్వరరావు ఉపాధి కోసం విశాఖ వచ్చి.. ఇటువంటి వ్యవహారాలను అడుగుతున్నట్టు సమాచారాన్ని సేకరించారు. ఈ మేరకు కోటేశ్వరరావు కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. త్వరలో నిందితుడిని ట్రాక్ చేస్తామన్నారు ఏసిపి త్రినాధరావు.
కాగా ఈ నకిలీ పాత్రలతో బెయిల్ పొందిన వాళ్లు గతంలో అనేకమంది ఉన్నట్టు పోలీసులకు ఇన్ఫర్మేషన్. గంజాయి కేసు నిందితులు ఈ ఫోర్జరీ పత్రాలతో బెల్ పొంది.. మళ్లీ పోలీసులకు అంతుచిక్కకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి చాలా కేసుల్లో ఇలానే జరిగింది. 2016, 2019 లోను ఇటువంటి ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆయా కేసుల్లో కీలకంగా ఉన్న వ్యక్తి కూడా కోటేశ్వర్ రావ్ అని గుర్తించారు. అరెస్టయి జైలుకెళ్లి మళ్ళీ బయటికి వచ్చి మళ్లీ అదే పని చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు.
అలాగే గతంలో పట్టుబడిన ఓ ముఠా ఆరు చోట్ల 219 కేసుల్లో ఇటువంటి పత్రాలు సమర్పించినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. తాజాగా పట్టుబడిన ముఠా లో కీలక నిందితుడు కోటేశ్వరరావు పట్టుపడితే… ఈ కేసు లో మరిన్ని మూలాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు విశాఖ పోలీసులు.
మక్దుద్ హుస్సేన్ ఖాజా, టీవీ9 రిపోర్టర్, విశాఖపట్నం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..