- Telugu News Photo Gallery Cricket photos Sean Williams fabulous century against USA in WC Qualifiers 2023
WC Qualifiers: 21 ఫోర్లు, 5 సిక్సర్లు, 174 రన్స్.. ఆకాశమే హద్దుగా చెలరేగిన జింబాబ్వే సారథి.. చరిత్రలో మూడో ప్లేయర్‌గా..
ICC World Cup Qualifiers 2023: జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసీసీవన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో భాగంగా అమెరికాపై ఆతిథ్య జట్టు ఏకంగా 408 పరుగులు చేసి చారిత్రాత్మక స్కోర్ నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ 101 బంతుల్లోనే 174 పరుగుల సెంచరీలో విజృంభించాడు.
Updated on: Jun 26, 2023 | 8:17 PM

ICC World Cup Qualifiers 2023: జింబాబ్వే రాజధాని హరారేలో జరిగిన వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ విధ్వంసకరమైన సెంచరీ చేశాడు. దీంతో జింబాబ్వే భారీ స్కోర్‌ని నమోదు చేసింది.

ముందుగా టాస్ గెలిచిన అమెరికా టీమ్ బౌలింగ్ ఎంచుకోవడంతో జింబాబ్వే తొలి బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా వచ్చిన జే గుంబి(78), ఇన్నోసెంట్(31) శుభారంభం అందించారు. మూడో నెంబర్ బ్యాట్స్‌మ్యాన్‌గా వచ్చిన టీమ్ కెప్టెన్ సీన్ విలియమ్స్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకర్షించాడు.

ఆరంభం నుంచే దూకుడుని కనబరుస్తూ అమెరికన్ బౌలర్లపై చెలరేగాడు. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన ప్రదర్శనను కొనసాగిస్తూ 101 బంతుల్లోనే 174 పరుగులు చేశాడు. అవకాశం లభిస్తే డబుల్ సెంచరీ కూడా చేసేవాడేమో అన్నవిధంగా అమెరికా బౌలర్లపై దాడిచేశాడు. విలియమ్స్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 21 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి.

అయితే అభిషేక్ పరాద్కర్ వేసిన 49 ఓవర్‌లో వెనుదిరిగాడు. అతనితో కలిసి సికిందర్ రజా(48), రైయాన్ బర్ల్(47) పర్వాలేదనిపించారు. అలాగే చివర్లో వచ్చిన మరుమణి కూడా 6 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్సర్లతో అజేయంగా 18 పరుగులు చేశాడు.దీంతో జింబాబ్వే స్కోర్ 6 వికెట్ల నష్టానికి 408 పరుగులకు చేరింది.

కాగా, భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన అమెరికా బ్యాటర్లు 104 పరుగులకే కుప్పకూలిపోయారు. ఫలితంగా అమెరికాపై జింబాబ్వే ఏకంగా 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక అమెరికా తరఫున 3 వికెట్లు తీసిన అభిషేక్ పరాద్కర్ బ్యాటింగ్‌లో కూడా 24 పరుగులు చేసి యూఎస్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మొత్తానికి జింబాబ్వే తరఫున వన్డేలో అత్యధిక స్కోరు చేసిన మూడో ఆటగాడిగా విలియమ్స్ నిలిచాడు. 2009లో బంగ్లాదేశ్‌పై 194(నాటౌట్) పరుగులు చేసిన చార్లెస్ కెవిన్ కోవెంట్రీ అగ్రస్థానంలో ఉండగా, కెన్యాపై 178(నాటౌట్) పరుగులతో హామిల్టన్ మసకద్జా రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా 174 పరుగులతో సీన్ విలియమ్స్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు.




