Telangana Politics: తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్.. వరుసగా ఢిల్లీకి క్యూ కట్టిన నేతలు..
Telangana Politics: ఢిల్లీ సెంట్రిక్‌గానే ఇప్పుడు తెలంగాణ రాజకీయం నడుస్తోంది. అటు కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ బాట పడుతుంటే.. ఇటు బీజేపీ నేతలు కూడా హస్తినలోనే మకాం వేశారు. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ పరిస్థితులపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం..
ఢిల్లీ సెంట్రిక్‌గానే ఇప్పుడు తెలంగాణ రాజకీయం నడుస్తోంది. అటు కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ బాట పడుతుంటే.. ఇటు బీజేపీ నేతలు కూడా హస్తినలోనే మకాం వేశారు. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ పరిస్థితులపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం.. ముఖ్య నేతలతో భేటీ అవుతోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో బండికి ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ నేతలతో బీజేపీ జాతీయ నాయకత్వం వరుసగా జరుపుతున్న చర్చల వెనుక ఉన్న అసలు మర్మం ఏంటి..?
తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించాలని చూస్తున్న బీజేపీ క్రమక్రమంగా స్పీడ్ పెంచుతోంది. ఈ క్రమంలోనే కీలక నేతలను ఢిల్లీకి పిలిపించుకుని చర్చలు జరుగుతోంది జాతీయ నాయకత్వం. ఇటీవలే ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయిన బీజేపీ పెద్దలు.. రాష్ట్ర రాజాకీయాల్లో తాజా పరిస్థితులపై చర్చించారు. ఇరువురి నాయకుల వెర్షన్ ఏమిటనేది క్లియర్‌గా విన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీ నుంచి బండికి పిలుపు వచ్చింది. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ కూడా హుటాహుటిన ఢిల్లీ పెద్దలను కలిసేందుకు హస్తినకు బయలుదేరారు.
కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ బీజేపీలో జరిగిన పలు అనూహ్య పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయనే చర్చలు ఉన్నాయి. కమల నేతల వివాదాస్పద కామెంట్లు, నాయకుల తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయనే వాదన కూడా లేకపోలేదు. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే దక్షిణాదిలో పాగా వేయడం కష్టమేనని బీజేపీ హైకమాండ్ భావించి నేతలతో ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పార్టీలోని అసంతృప్త నేతలతో భేటీ అనంతరం బండి సంజయ్ ఢిల్లీ టూర్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బండికి ఎలాంటి అంశాలపై హైకమాండ్ దిశానిర్దేశం చేయనుందనే చర్చ జరుగుతోంది.
కాగా, బీజేపీ తెలంగాణ నాయకత్వంలో మార్పులంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈటెలకు కీలక బాధ్యతలు అనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బండితో ఢిల్లీ పెద్దల తాజా మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తెలంగాణ బీజేపీ నేతలతో హైకమాండ్ నిర్వహిస్తున్న సమావేశాలు ఎంత మేరకు ఫలితాన్నిస్తాయనేది తెలియడంలేదు. కానీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జాతీయ నాయకత్వం తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు మాత్రం అర్థమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..