Asaduddin Owaisi: ఈసారి మెజారిటీ స్థానాల్లో పోటీ.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన
ఇప్పటిదాకా ఒకలెక్క.. ఇక నుంచి మరో లెక్క.. ఇన్నాళ్లూ సహకరించాం.. చేతనైనంత సాయం చేశాం.. కానీ మా సాయాన్ని గుర్తించడం లేదు. ఇక తేల్చుకుందాం అంటోంది MIM. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో చూద్దాం అంటూ నేరుగా సవాల్ విసురుతున్నారు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఇంతకీ ఆయన సవాల్ విసిరేది ఎవరికి?
MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తాం అంటున్నారు. ఈసారి మెజారిటీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడెక్కడ పోటీ చేస్తాం అనేది ఎన్నికల ముందు ప్రకటిస్తాం. బోధన్‌లోనూ MIM పోటీ చేస్తుందన్నారు ఎంపీ అసద్. కొన్ని రోజులుగా బోధన్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు.. పతంగి పార్టీకి కారు పార్టీకి మధ్యన గ్యాప్ పెంచాయి. శుక్రవారం జరిగిన గొడవతో పీక్ స్టేజికి వెళ్లింది. గత శుక్రవారం పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే షకీల్‌ను.. ఇద్దరు కౌన్సిలర్లు నిలదీశారు. తమ వార్డుల్లో అభివృద్ధి జరగడం లేదనీ.. నిధుల విడుదల్లో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపించారు. దీంతో వారిపై హత్యాయత్నంతో పాటు మరో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వారు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.
జైలులో ఉన్న తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించిన ఎంపీ అసదుద్దీన్.. స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు అయిన MIM నేతలు గతంలో షకీల్ గెలుపు కోసం పని చేశారనీ.. ఇప్పుడేమో కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అసద్‌ను ఓడించి తీరుతామని హెచ్చరించారు అసద్.
తెలంగాణలోనే బోధన్ నియోజకవర్గం ప్రత్యేకం. మతఘర్షణలు, రాజకీయాలతో ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే ఈసారి బోధన్ వేదికగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రమే మారబోతోంది. బీఆర్‌ఎస్, MIM మైత్రీ బంధం చెడిపోతోందా? హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రం మొత్తం పోటీ చేయబోతోందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..