Budget 2025: బడ్జెట్ సమావేశాలు.. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. మరి వైసీపీ పరిస్థితేంటి..?

పార్లమెంట్ సమావేశాలు ఈనెల 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.. దీంతో టీడీపీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. నిధులు ఎలా రాబట్టాలి... బడ్జెట్‌పై చర్చలో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. మరి వైసీపీ పరిస్థితేంటి...? బడ్జెట్‌పై చర్చలేవి...? నేతలతో మీటింగులెక్కడ...? విజయసాయి తర్వాత రాజ్యసభలో వైసీపీ టీమ్‌ లీడ్‌ ఎవరు...? ఇప్పుడివే అంశాలు చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ సెలెన్స్‌పై చర్చలూ ఊపందుకున్నాయి.

Budget 2025: బడ్జెట్ సమావేశాలు.. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. మరి వైసీపీ పరిస్థితేంటి..?
Ys Jagan CM Chandrababu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 29, 2025 | 7:40 AM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈనెల 31న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో.. చంద్రబాబు ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఏవిధంగా కేటాయింపులు ఉంటాయి..? వాటిమీద ఎలా స్పందించాలి.? బడ్జెట్‌పై చర్చలో ఎలా వ్యవహరించాలి..? ఎలాంటి అంశాలు లేవనెత్తాలి..? అనే విషయాలపై గైడెన్స్‌ ఇచ్చారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో కచ్చితంగా శంకుస్థాపన చేసేలా ఎంపీలంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా ప్రయత్నించాలన్నారు.

ఎంపీలతో చంద్రబాబు మీటింగ్‌లో… అమరావతి, పోలవరం కీలకమైన ప్రాజెక్టులే ప్రధానంగా ప్రస్తావనకొచ్చినట్టు తెలుస్తోంది. గత బడ్జెట్‌లోనే పోలవరం కోసం 12 వేల కోట్ల పైచిలుకు నిధులు కేటాయించింది కేంద్రం. కానీ.. చివరి డీపీఆర్‌ను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదల చేసేలా కార్యాచరణ ఉండాలి… పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చివరి పైసా వరకూ తమదే బాధ్యత అని ఇటీవలే హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. అటు.. అమరావతి మౌలిక సదుపాయాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్రానికి నిధులు రావాల్సిన నిధులు, తీసుకురావాల్సిన విధానంపైనా పార్టీ ఎంపీలకు డైరెక్షన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు..

వైసీపీ సైలెంట్..

ఇక టీడీపీ సంగతి అటుంచితే… వైసీపీలో కేంద్ర బడ్జెట్‌ సమావేశాలపై ఎలాంటి ఊసు లేదు. వైసీపీ ఎంపీలతో అధినేత భేటీ అయ్యిందీ లేదు. ఎంపీలకు దిశానిర్దేశం, గైడెన్స్‌ అన్న మాటలు అస్సలేలేవు. అసలేంటి వైసీపీలో ఏం జరుగుతోంది…? కీలక బడ్జెట్‌ టైమ్‌లోనూ కామ్‌గా ఉండటమేంటి…? అంటూ పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌హాట్‌ డిబేట్స్‌ నడుస్తున్నాయ్.

ఇక విజయసాయి రెడ్డి రాజీనామాతో వైసీపీ కాస్త డల్‌ అయినట్లు తెలుస్తోంది. మూడేళ్లు ఉండగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. అంతేకాదు పార్టీకి కూడా గుడ్‌బై చెప్పేశారు. అయితే పార్లమెంట్‌ సెషన్స్‌లో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించేవారు. పార్లమెంట్‌లో వైసీపీకి టీమ్‌ లీడ్‌గా ఉండేవారు. ఇప్పుడాయన లేకపోవడం వైసీపీ పెద్దలోటే అయినప్పటికీ… ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు. వైసీపీ ఎంపీలను ఎవరు లీడ్‌ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది…!

రాజ్యసభలో 11 మందిగా ఉండే వైసీపీ టీమ్‌ ఇప్పుడు ఏడుకి పడిపోయింది. అంతకుముందు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేయగా… తాజాగా విజయసాయిరెడ్డి పార్టీని వీడటంతో ఆ సంఖ్య ఏడుకి తగ్గింది. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మరి వీరిలో ఎవరు విజయసాయిరెడ్డి పాత్ర పోషిస్తారు…? పార్టీ గొంతును ఎవరు గట్టిగా వినిపిస్తారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

మొత్తంగా… బడ్జెట్‌ సెషన్స్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీలోని పార్టీలని ప్రిపేర్‌ అవుతుంటే… వైసీపీలో మాత్రం నిర్లిప్తత కనిపిస్తోంది. ఇప్పటివరకు పార్టీ అధినేత ఎంపీలతో భేటీ కాకపోవడం, దిశానిర్దేశం చేయకపోవడం చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..