AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు! ఏ తరగతి వారికి ఇస్తారంటే..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇన్ఫోసిస్ సంయుక్తంగా 'ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్' కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 6-9 తరగతి విద్యార్థుల కు ఉచిత ట్యాబ్‌లు పంపిణీ చేసి, వారిలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యం. డిజిటల్ పాఠ్యాంశాల తో, విద్యార్థులు తమ అభ్యసనాన్ని మెరుగుపరుచుకుంటారు.

గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు! ఏ తరగతి వారికి ఇస్తారంటే..?
Ap Government Free Tablets
SN Pasha
|

Updated on: Oct 09, 2025 | 9:52 AM

Share

విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఇన్ఫోసిస్ కలిసి ‘ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు టెక్నాలజీలో నైపుణ్యం పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఇది మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అని తెలిసిందే.

కార్పొరేట్ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ కింద 38 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 30 చొప్పున ఇన్ఫోసిస్ ట్యాబ్‌లను అందించారు. ఈ ట్యాబ్‌ల ద్వారా 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో పాఠాలు చెప్పనున్నారు. దీనికి సంబంధించి ఉపాధ్యాయులకు డిజిటల్ విద్యపై శిక్షణ కూడా ఇచ్చారు. గళగిరి నియోజకవర్గంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైతే.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

అప్రెంటిస్‌షిప్‌కు అవకాశం..

రాష్ట్రంలోని 6 నుంచి 9 తరగతుల విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ, సమగ్ర శిక్ష కలిసి ట్యాబ్ కంటెంట్‌ను రూపొందించాయి. గణితం, సైన్స్, ఆంగ్లం, జీవన నైపుణ్యాలు వంటి సబ్జెక్టులను బోధించడానికి ఈ ట్యాబ్‌లను ఉపయోగిస్తారు. ఇన్ఫోసిస్ సంస్థ ప్రత్యేక ప్లాట్‌ఫాం ద్వారా ట్యాబ్‌ల వినియోగాన్ని పర్యవేక్షిస్తూ, నెలవారీ నివేదికలను ప్రభుత్వానికి అందిస్తుంది. ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఒక గంట, ప్రతి పాఠశాల నాలుగు గంటలు ట్యాబ్‌లను వాడేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాదు ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలకు ప్రశంసాపత్రాలు, ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇన్ఫోసిస్‌లో అప్రెంటిస్‌షిప్ అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు.

ఈ ట్యాబ్ కంటెంట్ రాష్ట్ర కరిక్యులంకు అనుగుణంగా తయారు చేశారు. విద్యార్థులు వీడియో పాఠాలు చూసిన తర్వాత, వాటిపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాసి వెంటనే రిజల్ట్‌ తెలుసుకోవచ్చు. ఇది వారి ప్రొగ్రెస్‌ను అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విద్య అందుతుందని సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు.. అయితే అప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేయగా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఇన్ఫోసిస్ కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి