APSRTC: ఇకపై వాట్సాప్‌లోనూ ఆర్టీసీ టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలంటే.?
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రయాణీకులకు మరింత సౌలభ్యంగా ఉంచుతోంది ఏపీఎస్ఆర్టీసీ. తాజాగా వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. మరి అందులో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌లో 9552300009 నెంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపిస్తే చాలు ఏపీఎస్ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి నిత్యం లక్షలాది మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తుంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకుల కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఎప్పటి నుంచో అమలులో ఉంది. దీని కోసం రెడ్ బస్, abhibus, పేటీఏం లాంటి ఫ్రాంచైజీలు, టికెట్ బుకింగ్(ATB) ఏజెంట్లు ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ టిక్కెట్లను ఏపీఎస్ఆర్టీసీ జారీ చేస్తోంది. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడూ ముందుంటుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో ఏపీఎస్ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ బుకింగ్ సేవను వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ సేవల అధికారిక వాట్సాప్ ప్లాట్ ఫామ్(మన మిత్ర- 9552300009) ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ బుకింగ్ సేవను వాట్సాప్ ద్వారా కూడా పొందే విధంగా అవకాశం కల్పించారు.
వాట్సాప్(మన మిత్ర) ద్వారా ఏపీఎస్ఆర్టీసీ టిక్కెట్లను బుక్ చేసుకోవడం గురించి ప్రయాణీకులలో అవగాహన చాలా తక్కువగా ఉందని.. అందువల్ల ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలను పెంచడానికి, ఈ వాట్సాప్ సేవను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంది. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో వాట్సాప్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి సంబంధించిన విధానాన్ని తెలియజేస్తూ, ప్రయాణీకులకు అర్థమయ్యేలా ప్రచారం కల్పించాలని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు అన్ని జిల్లాల ప్రజా రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల ప్రజా రవాణా అధికారులందరూ వాట్సాప్ టికెట్ బుకింగ్ సేవను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
బస్ స్టేషన్లు, రిజర్వేషన్ కౌంటర్లు, ఎంక్వైరీ కౌంటర్లు, బస్ స్టేషన్లలోని ఇతర ప్రముఖ ప్రదేశాలలో బ్యానర్లను ప్రదర్శించడంతో పాటు, బస్సుల లోపల స్టిక్కర్లను అంటించడం, 9552300009(మన మిత్ర) నెంబర్‌కు వాట్సాప్ ద్వారా APSRTC టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని ప్రచారం చేసే విధంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్‌ను చాలా సులభంగా బుక్ చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. ముందుగా 9552300009 వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్‌లో హాయ్ అని పంపిస్తే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన సేవలు అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత టికెట్ బుకింగ్‌ను ఎంచుకుని ప్రయాణ వివరాలు, ప్రయాణీకుల సమాచారాన్ని నమోదు చేసి ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే టికెట్ వెంటనే బుక్ అవుతుంది. టికెట్‌ను కూడా వెంటనే వాట్సాప్ ద్వారా పొందవచ్చని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం డిజిటల్ పాలనకు మరొక ముందడుగు అంటున్న అధికారులు.




